వాస్తవానికి ఈ వారం విడుదల కావల్సిన సినిమా సారంగపాణి జాతకం. ఆ మేరకు ముందు ప్రకటన ఇచ్చింది కూడా ఈ టీమే. అయితే ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి రూపంలో పోటీ రావడంతో రిస్క్ వద్దనుకుని ఏప్రిల్ 25కి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా ప్రమోషన్ల వేగం పెంచి నిన్న ట్రైలర్ లాంచ్ చేశారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి హీరో కాగా రూప హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభిరుచి కలిగిన సినిమాలు తీస్తారని పేరున్న శివలెంక కృష్ణప్రసాద్ దీనికి నిర్మాతగా వ్యవహరించారు.
నిజానికి ఈ సినిమా మీద ముందు పెద్ద బజ్ లేదు. అయితే ట్రైలర్ చూశాక ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. కామెడీతో పాటు ఇంద్రగంటి ఈసారి వెరైటీగా ఏదో ఫన్నీ క్రైమ్ జోడించినట్టు కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ అన్నట్టు కమల్ హాసన్ పుష్పక విమానాన్ని మూకీగా కాకుండా మాటల్లో తీస్తే ఎలా ఉంటుందనే తరహాలో సారంగపాణి జాతకం నవ్విస్తుందని చెప్పడం చూస్తే కంటెంట్ మీద నమ్మకం కలిగేలాగే ఉంది. ఇటీవలే కోర్ట్ రూపంలో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి ఈసారి సోలోగా హీరోగా బ్రేక్ అందుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. సారంగపాణి జాతకం అది తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.
అయితే విపరీతమైన ఎండలు, ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల మధ్య జనాలు థియేటర్లకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఏప్రిల్ నెల సగం అయిపోవస్తున్నా ఇప్పటిదాకా సాలిడ్ బ్లాక్ బస్టర్ ఒక్కటీ లేదు. మంచి పబ్లిసిటీ చేసుకున్న తమన్నా, కళ్యాణ్ రామ్ సినిమాలకు సైతం అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో కనిపించలేదు. సో అదిరిపోయే టాక్ వస్తేనే సారంగపాణి కోసం జనం థియేటర్లకు వస్తారు. రెండు వరస వైఫల్యాల తర్వాత ఇంద్రగంటికి దీని సక్సెస్ చాలా కీలకం. ఇది విజయం సాధిస్తే ఆయన ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీకి రూట్ క్లియరవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates