బిగ్ బాస్ నాలుగో సీజన్ తాజా ఎపిసోడ్ ఉత్కంఠ రేకెత్తించింది. వైల్డ్ డాగ్ షూటింగ్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న అక్కినేని నాగార్జున ఈ వారం తిరిగి షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఆధ్వర్యంలో వీకెండ్ ఎపిసోడ్లు రెండూ ఆసక్తికరంగా సాగాయి. ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ మరింతగా అలరించింది.
ఒక దశలో అమ్మ రాజశేఖర్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించేసి.. అతణ్ని బట్టలు కూడా సర్దుకోమని నాగార్జున చెప్పడంతో హౌస్‌లో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. హౌస్ మేట్స్‌తో పాటు వీక్షకులు సైతం రాజశేఖర్ ఎలిమినేట్ అవుతున్నట్లే అనుకున్నారు. రాజశేఖర్ సైతం దానికి మానసికంగా సిద్ధమైపోయారు. కానీ చివర్లో నాగ్ ట్విస్టు ఇచ్చాడు.
ఇప్పటికే నోయల్ అనారోగ్యంతో షో నుంచి అనుకోకుండా వైదొలిగిన నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. నిజానికి నోయల్ వైదొలగడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదనే ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఆ విషయం అంత సులువుగా తేల్చలేదు. నాటకీయంగా ఎపిసోడ్‌ను నడిపించారు.
ఎలిమినేషన్ తుది జాబితాలో నిలిచిన అమ్మ రాజశేఖర్, మెహబూబ్‌లను గదిలోకి పంపించారు. అక్కడి నుంచి మెహబూబ్‌ను తిరిగి హౌస్‌లోకి వెళ్లమన్నాడు నాగ్. దీంతో అతను బోరున విలపిస్తూ హౌస్ మేట్స్ వద్దకు వెళ్లాడు. తాను సేవ్ అయినప్పటికీ, తనకు ఆత్మీయుడైన రాజశేఖర్ వెళ్లిపోవడంతో అతను ఉద్వేగానికి గురయ్యాడు.
తర్వాత రాజశేఖర్‌ను నాగ్ బట్టలు సర్దుకోమన్నాడు. అతనొచ్చి బ్యాగ్ తీసుకుని సహచరులకు బై చెబుతున్న సమయంలో నాగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అతడికి ఎలిమినేషన్ లేదని చెప్పడమే కాదు.. ఈ వారం కెప్టెన్‌గా కూడా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. దీంతో హౌస్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates