దక్షిణాది సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చిన దర్శకుల్లో శంకర్ ఒకడు. ‘జెంటిల్‌మేన్’తో మొదలుపెట్టి ‘2.0’ వరకు శంకర్ తీసినవన్నీ ప్రపంచ స్థాయి సినిమాలే. ఐతే గత కొన్నేళ్లలో ఆయన్నుంచి అభిమానులు ఆశించే స్థాయి సినిమా రాలేదు. ‘రోబో’ తర్వాత శంకర్ చేసిన సినిమాలేవీ అనుకున్నంతగా ఆడలేదు. ప్రస్తుతం ఆయన రెండు దశాబ్దాల కిందటి తన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఇండియన్’కు సీక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఆ సినిమా ముందుకు కదలకపోవడానికి కరోనా కూడా ఒక కారణమే. వేరే కారణాలు కూడా తోడై దాదాపు ఏడాదిగా శంకర్ ఖాళీగా ఉన్నాడు. ఐతే ముందు వేరే ఆలోచనలేమీ లేవు కానీ.. కరోనా వల్ల వచ్చిన విరామంలో మాత్రం శంకర్ తన తర్వాతి సినిమా మీద దృష్టిసారించాడట. ఒక భారీ మల్టీస్టారర్ మూవీ తీయడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ మంచి పేరున్న శంకర్.. ఈ నాలుగు భాషల నుంచి ఒక్కో స్టార్ హీరోను ఎంచుకుని మల్టీస్టారర్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడట. కన్నడ నుంచి ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్.. తమిళంలో నుంచి విజయ్ సేతుపతి ఈ సినిమాకు ఖరారైనట్లు చెబుతున్నారు. రజనీకాంత్‌తో ‘లింగ’.. తెలుగులో రవితేజతో ‘పవర్’ లాంటి సినిమాలు నిర్మించిన కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నాడట.
‘ఇండియన్-2’ పున:ప్రారంభంపై క్లారిటీ రాకపోవడంతో శంకర్ ఈ సినిమానే ముందు మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తీరుతో విసిగిపోయిన శంకర్.. వెంటనే సినిమాను పున:ప్రారంభించేది లేనిది చెప్పకపోతే తాను వేరే సినిమాను మొదలుపెడతానని హెచ్చరిస్తూ ఇటీవల లేఖ కూడా రాసినట్లు తమిళ మీడియా వెల్లడించింది. ఐతే ముందో, వెనుకో ఈ మల్టీస్టారర్ మూవీని శంకర్ చేయడమైతే గ్యారెంటీనే అంటున్నారు.