మాయాబజార్ పాటను…సావిత్రి నృత్యాన్ని అవమానిస్తారా

ఏ భాష పరిశ్రమ అయినా క్లాసిక్స్ అని చెప్పుకునే సినిమాలకు చెరిగిపోని చరిత్ర ఉంటుంది. దాన్ని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించకూడదు. క్రియేటివిటీ పేరుతో దాన్ని ఏమార్చి ఇష్టం వచ్చినట్టు వాడుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర విమర్శలు తప్పవు. ఆహా ఓటిటిలో పేరొందిన రియాలిటీ షో డాన్స్ ఐకాన్. దీని సీజన్ 2లో ఒక పాటకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే మాయాబజార్ లో ఆహ నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట సాంగ్ ని రీమిక్స్ చేసి ఒక అమ్మాయి బెల్లి డాన్స్ తరహాలో చాలీచాలని దుస్తులతో నృత్యం చేసింది. చూసేందుకు ఎబ్బెట్టుగా అనిపించిన స్టెప్పులున్నాయి.

మహానటి సావిత్రి అద్భుతమైన ఎక్స్ ప్రెషన్లతో చిరస్ధాయిలో గుర్తుండిపోయేలా నర్తించిన గొప్ప పాట అది. దాన్ని రీమిక్స్ చేయడమే తప్పనుకుంటే ఇలా డాన్స్ షో పేరిట ఖంగాళీ చేయడం ముమ్మాటికీ అవమానించడమేనని చెప్పక తప్పదు. సృజనాత్మకత ఎప్పుడూ ఆణిముత్యాలను ఎగతాళి చేసేలా ఉండకూడదు. ప్రస్తుత మరియు భవిష్యత్ తరాలకు తప్పుడు సంకేతాలు పంపిస్తాయి. వాళ్ళు అహ నా పెళ్ళంటకు సావిత్రిని బదులు కొత్తగా డాన్స్ చేసిన యువతిని గుర్తు చేసుకుంటే ప్రమాదం. అసలు కొరియోగ్రఫీ చేసినవాళ్ళైనా దీని గురించి ముందే కొంచెం సీరియస్ గా ఆలోచన చేసి ఉండాల్సింది.

ఒకవేళ వివాదం కోసమే మేకర్స్ ఇలా చేశారా లేక అనాలోచితంగా జరిగిపోయిందా అనేది వేచి చూడాలి. ఫుల్ ఎపిసోడ్ ఏప్రిల్ 18 స్ట్రీమింగ్ కానుంది. ఈలోగా అబ్జెక్షన్లు కాంట్రవర్సీలు వచ్చేలా ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే జడ్జ్ గా అక్కడ శేఖర్ మాస్టర్ ఉన్నారు. ప్రమోషన్ కోసం వచ్చిన సారంగపాణి జాతకం దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో ప్రియదర్శి, హీరోయిన్ రూప గెస్టులుగా ఉన్నారు. ఇదంతా వాళ్ళ కళ్ళముందే తిరిగింది. ఇంద్రగంటి అయితే డాన్స్ కొత్తగా ఉందనే కితాబు కూడా ఇచ్చేశారు. బహుశా అక్కడ లైవ్ లో చూడటం వల్ల తప్పనిపించలేదేమో. ఏది ఏమైనా ఇది ఎంతమాత్రం సమర్ధనీయం కాదు.