జనాలు మరీ సున్నితంగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో సినిమాలు తీయడం చాలా కష్టమైపోతోంది. ఇంతకుముందు ఫిలిం మేకర్స్ వివాదాస్పద అంశాల మీద సినిమాలు తీసి స్వేచ్ఛగా తాము ఏం చెప్పాలనుకుంటే అది చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా జనాలు మనోభావాలు దెబ్బ తీసేసుకుంటున్నారు. సినిమాలో ఏం చూపించారో తెలుసుకోకుండానే ముందే ఒక అంచనాకు వచ్చేసి గొడవ చేసేస్తున్నారు. అదే సందర్భంలో దర్శకులు మరీ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని డ్రామా కోసం వాస్తవాల్ని వక్రీకరించినా తప్పే.
తాజాగా రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రిలీజ్ చేసిన కొమరం భీమ్ టీజర్లో ఎన్టీఆర్ ముస్లిం టోపీ ధరించడం పట్ల దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ముస్లిం నియంత నిజాం మీద పోరాడిన భీమ్‌కు ముస్లిం టోపీ ఎలా పెడతారన్నది ఆయన కుటుంబీకుల ప్రశ్న.
ముందు భీమ్ కుటుంబీకులు మాత్రమే దీనిపై స్పందించారు. అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఓ ప్రధాన రాజకీయ పార్టీ కూడా రంగంలోకి దిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ సినిమా ఎలా రిలీజవుతుందో చూస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. సినిమా మేకింగ్ దశలో ఉండగానే ఇలా ఉంటే.. మున్ముందు వ్యవహారం తీవ్ర రూపం దాల్చినా దాల్చొచ్చు. ఇది చిత్ర బృందానికి అనవసర వివాదమే.
కేవలం పబ్లిసిటీ కోసం టీజర్లో అలా చూపించారా.. లేక సినిమాలోనూ దీనికి సంబంధించిన దృశ్యాలుంటాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ ఎంతో రీచ్ ఉండే రాజమౌళి సినిమాకు ఇలాంటి వివాదం ఇబ్బందికరమే. ఇన్ని రోజులూ జక్కన్న సైలెంటుగా ఉండిపోయాడు కానీ.. వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో వివరణ ఇవ్వక తప్పేలా లేదు. అలాగే సంబంధిత సన్నివేశాల విషయంలోనూ పునరాలోచించుకోవాల్సిందే.