పెరుసు – ఇంత విచిత్రమైన ఐడియా ఎలా వచ్చిందో

తమిళంలో ఆ మధ్య పెరుసు అనే సినిమా రిలీజయ్యింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు డబ్బింగ్ తో పాటు నిన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాదేది కవితకనర్హం అన్నట్టు క్రియేటివిటీ పేరుతో దర్శకులు తొక్కుతున్న కొత్త పుంతలు చూస్తుంటే భవిష్యత్తులో ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో అనిపిస్తుంది. మాములుగా హాలీవుడ్ లో ఎక్కువగా కనిపించే వెరైటీ కాన్సెప్టులు ఈ మధ్య పక్క భాషల్లో వస్తున్నాయి. వాటిలో ఒకటి పెరుసు. దర్శకుడు కోదండరామిరెడ్డిగారబ్బాయి, గొడవతో పరిచయమైన వైభవ్ ప్రధాన పాత్ర పోషించగా అతని అన్న సునీల్ ముఖ్యమైన  క్యారెక్టర్ దక్కించుకున్నాడు.

అసలు కథ చూస్తే ఇంతగా ఎందుకు చెప్పామో అర్థమవుతుంది. ఒక పెద్దాయన టీవీ చూస్తూ చనిపోతాడు. సరే పోయాడు కదా అంత్యక్రియలు చేద్దామని పూనుకున్న కుటుంబ సభ్యులకు ఆయన శరీరంలోని ఒక అవయవానికి విచిత్రమైన సమస్య కనిపిస్తుంది. దాన్ని బయటికి చెప్పుకుంటే సిగ్గు చేటు. పోనీ ఏదో ఒకటి చేసి పరిష్కరిద్దాం అంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. మరి ఈ గండాన్ని ఫ్యామిలీ ఎలా దాటింది అనేదే మెయిన్ పాయింట్. ఆ సమస్య ఏంటో ఇక్కడ ప్రస్తావించడం సబబు కాదు కానీ చాలా సున్నితమైన అంశం తీసుకున్న దర్శకుడు ఇళంగో రామ్ అసభ్యత లేకుండా తీసేందుకు ప్రయత్నించాడు.

ఒక శవం చుట్టూ బలమైన భావోద్వేగాలను ఎంత గొప్పగా పండించవచ్చో బలగంలో చూశాం. దానికి రివర్స్ లో పెరుసు ఉంటుంది. అయినా ప్రాణం పోయిన డెడ్ బాడీ మీద కామెడీ చేయడం ఏమిటనే ఫీలింగ్ వస్తే దీన్ని మధ్యలోనే ఆపేయడం ఖాయం. కొన్ని సున్నితమైన నేపధ్యాలు చదవడానికి బాగుంటాయి కానీ తెరమీదకెక్కించే క్రమం అంత సులభంగా ఉండదు. పైగా సభ్య సమాజం ఇలాంటి వాటిని అంత సులభంగా అంగీకరించదు. ఒకవేళ ఒప్పుకునే పనైతే పెరుసుని ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే మాత్రం ఈ ఐడియా ఎలా వచ్చింది బాసూ అంటూ దర్శకుడిని తలుచుకుంటూ ఆపేయాల్సి ఉంటుంది.