డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు సహా.. అనేక విషయాల్లో మంచు మనోజ్ వర్సెస్ మోహన్‌బాబు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇవి పోలీసుల కేసులు.. కోర్టుల జోక్యం వరకు వెళ్లాయి. తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరమీదికి వచ్చింది. తన కారును సోదరుడు మంచు విష్ణు దొంగిలించినట్టు.. మనోజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు.. తాము లేనప్పుడు.. తమ ఇంట్లోకి ప్రవేశించి.. వస్తువులు ధ్వంసం చేశారని తెలిపారు.
ఏం జరిగింది?
బుధవారం హైదరాబాద్ శివారు ప్రాంతం జల్‌పల్లిలోని డైలాగ్ కింగ్ ఇంటి వద్దకు ఆయన చిన్నకుమారు డు మనోజ్ వచ్చారు. అయితే.. ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే మనోజ్ కూర్చుని ధర్నాకు దిగారు. విషయం తెలిసిన పోలీసులు.. రంగంలోకి దిగి భారీ భద్రతను కల్పించారు. చాలా సేపు మనోజ్ అక్కడే కూర్చున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. తన ఇంట్లోకి విష్ణు అక్రమంగా చొరబడ్డాడని ఆరోపించారు.
తాము ఇంట్లో లేని సమయంలో విష్ణు వచ్చి.. ఇంట్లో సామాగ్రిని ధ్వంసంచేసినట్టు మనోజ్ ఆరోపించారు. అదేసమయంలో తమ కారును టోయింగ్ వాహనం సాయంతో తీసుకువెళ్లి నడిరోడ్డుపై పడేశారని.. తెలిపారు. అయితే.. తాము ఫిర్యాదు చేయగానే.. సదరు వాహనం విష్ణు ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారని మనోజ్ కుమార్ చెప్పారు. అంతేకాదు.. జల్‌పల్లిలో తన భద్రతా సిబ్బందిపై దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. అయితే.. తాజా వివాదంపై మోహన్ బాబు కానీ, విష్ణు కానీ.. స్పందించకపోవడం గమనార్హం.