ఓదెల 2 – ప్రేతశక్తిని ఎదిరించే దైవభక్తి

మిల్కీ బ్యూటీగా పేరున్న తమన్నా ఈసారి పూర్తిగా వేషం మార్చుకుని శివ భక్తురాలిగా చేసిన సినిమా ఓదెల 2. టీజర్ వచ్చాక బిజినెస్ వర్గాల్లో క్రేజ్ వచ్చి రిలీజ్ కు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ ఇచ్చిన మూవీగా దీని మీద ట్రేడ్ చాలా నమ్మకం పెట్టుకుంది. గత కొంత కాలంగా తెలుగులో ఆధ్యాత్మికత మిక్స్ చేసిన హారర్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలతో పాటు పర్యవేక్షణ చేస్తూ నిర్మాతల్లో ఒకడిగా ఉన్న సంపత్ నంది దీనికి అంతా తానై ముందుకు నడిపిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ డ్రామా ట్రైలర్ లాంచ్ ఇవాళ ముంబైలో ఘనంగా నిర్వహించారు.

స్టోరీని దాచే ప్రయత్నం చేయలేదు. ఓదెల గ్రామంలో గతంలోనే చనిపోయాడని భావించిన తిరుపతి (వశిష్ట సింహ) ప్రేతాత్మగా మారి అక్కడి జనాన్ని ఆవహిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు. ఎందరో అమాయకులు దారుణమైన హత్యలకు గురవుతారు. అప్పుడు అక్కడ అడుగు పెడుతుంది శివుడిని ఆరాధించే శివశక్తి (తమన్నా). ఫకీర్లు, పోలీసులు ఎవరూ కట్టడి చేయలేకపోతున్న తిరుపతిని అంతమొందించే బాధ్యతను ఆమె తీసుకుంటుంది. అయితే ముక్కంటినే తూలనాడేందుకు వెనుకాడని ఆ దుర్మార్గుడిని ఎలా కట్టడి చేశారనేది ఓదెల 2ని రక్తి కట్టించబోయే అసలు పాయింట్.

విజువల్స్ పరంగా సస్పెన్స్, థ్రిల్, హారర్ మూడు మిక్స్ చేయడంలో అశోక్ తేజ పనితనం కనిపిస్తోంది. విరూపాక్ష, మంగళవారం లాంటి హిట్లకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ మరోసారి తన పనితనం చూపించాడు. పెర్ఫార్మన్స్ ఎక్కువ డిమాండ్ చేసే పాత్రలో తమన్నా జీవించినట్టే ఉంది. భారీ డైలాగులతో పాటు పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పడ్డాయి. క్యాస్టింగ్ ని దాదాపు రివీల్ చేసేసిన ఓదెల 2 బృందం ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చో ముందే క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 17 విడుదల కాబోతున్న ఓదెల 2 కోసం విస్తృతమైన ప్రమోషన్లు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా భాషల్లో తీసుకొస్తున్నారు.