ఇతర హీరోల అభిమానులు రీ రీ లాంచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నా తనదైన రోజు అఖిల్ ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ తో తనను తాను రుజువు చేసుకుంటాడనే నమ్మకం అక్కినేని అభిమానుల్లో ఉంది. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత పునఃసమీక్షలో పడిపోయిన అఖిల్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకుని లెనిన్ ఓకే చేశాడు. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవాళ టీజర్ రూపంలో ప్రేక్షక లోకానికి లెనిన్ పాత్రని పరిచయం చేశారు.
అల్ట్రా స్టైలిష్ లుక్స్ కి భిన్నంగా ఈసారి అఖిల్ ని పక్కా పల్లెటూరి యువకుడి మాస్ వేషంలోని మార్చేశారు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది పేరు ఉండదు, పోయాక ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటాది లాంటి అర్థవంతమైన డైలాగుతో లెనిన్ క్యారెక్టరైజేషన్ ఏంటో చెప్పేశారు. కథకు సంబంధించిన క్లూస్ ఇవ్వకపోయినా చక్రం పట్టని కృష్ణుడిగా ఇంట్రోలో చెప్పిన లైన్ ఇంటరెస్టింగ్ గా ఉంది. ప్రేమని మించిన యుద్ధం మరొకటి ఉండదనే క్యాప్షన్ లోనే దర్శకుడి ఉద్దేశం అర్థం చేసుకోవచ్చు. అఖిల్ లుక్స్ పవర్ ఫుల్ గా ఉండగా, అతన్ని ప్రేమించే అమ్మాయిగా శ్రీలీలను ఒక షాట్ లో చూపించి జంటని లాంచ్ చేశారు.
నిమిషం వీడియోనే అయినా అఖిల్ ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా లెనిన్ అంచనాలకు తగ్గట్టే ఉన్నాడు. నిజానికి ఈ తరహా కథలు ఎప్పుడో ట్రై చేసి ఉండాల్సింది. మరీ అర్బన్ లవ్ స్టోరీస్, యాక్షన్ డ్రామాలకు ఎక్కువ మొగ్గు చూపడంతో తన నిజమైన సత్తా ఏంటో తెలియకుండా పోయింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అఖండ స్థాయిలో అనిపించింది. నిర్మాణ విలువలు, టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకునేంత కంటెంట్ ఇవ్వలేదు కానీ జనాల్లో లెనిన్ ముద్ర వేయడానికి సరిపడా విజువల్స్ అయితే ఇచ్చేశాడు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాని లెనిన్ ఈ సంవత్సరంలోనే థియేటర్లలో అడుగు పెట్టే అవకాశం ఉంది.