బచ్చన్ గాయాన్ని గుర్తు చేసిన రైడ్ 2

మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం అంత సులభంగా మర్చిపోయేది కాదు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ రీమేక్ గా రూపొందిన ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామా అవసరం లేని మార్పులకు లోనై తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరీ వరస్ట్ మూవీ కాకపోయినా కంటెంట్ మీద అంచనాలు ఎక్కువగా ఉండటంతో అంత బరువు మోయలేక చతికిల బడింది. ఫలితం ఎలా ఉన్నా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జనాల దృష్టిలో పడటం, వరసగా టయర్ 2 స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కడం వేరే విషయం.

తాజాగా రైడ్ 2 వస్తోంది. వచ్చే నెల మే 1 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు. వీడియో కట్ ఆసక్తికరంగా ఉంది. ఈసారి విలన్ గా రితేష్ దేశముఖ్ (బొమ్మరిల్లు జెనీలియా భర్త) నటించాడు. ఆదాయపు పన్ను శాఖ దాడినే మెయిన్ పాయింట్ గా తీసుకున్నప్పటికీ గ్రాండియర్ నెస్ పెరిగింది. మొదటి భాగంలో హీరో అజయ్ దేవగన్ భార్యగా నటించిన ఇలియానా స్థానంలో వాణి కపూర్ వచ్చి చేరింది. రైడ్ ప్రతినాయకుడు సౌరభ్ శుక్లా తిరిగి రైడ్ 2లోనూ కనిపించడం విశేషం. రెండు సినిమాల మధ్య ఇంటర్ లింక్స్ బాగా కుదిరాయి. ఒకవేళ మిస్టర్ బచ్చన్ హిట్టయ్యుంటే మనకూ సీక్వెల్ వచ్చేది.

దీని సంగతలా ఉంచితే రైడ్ 2 మన నాని హిట్ 3 ది థర్డ్ కేస్ కి ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన పోటీ ఇవ్వనుంది. ఇంకోవైపు సూర్య రెట్రో తమిళనాడు, కేరళలో ప్రభావితం చేయనుంది. నార్త్ ట్రేడ్ లో రైడ్ 2 మీద భారీ అంచనాలున్నాయి. గత కొంత కాలంగా డ్రైగా ఉన్న థియేటర్లకు అజయ్ దేవగన్ జనాన్ని తీసుకొస్తాడని నమ్ముతున్నారు. సికందర్ ఘోరంగా బోల్తా కొట్టిన నేపథ్యంలో అక్కడి బిజినెస్ కి రైడ్  2 హిట్ కావడం చాలా కీలకం. అందుకే పెద్ద ఎత్తున థియేటర్ కేటాయింపులు జరగనున్నాయి. టి సిరీస్ నిర్మాణం కనక డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పనక్కర్లేదు. దీనికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు.