యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డకు యూత్‌లో బంపర్ క్రేజ్ తీసుకొచ్చి తనను స్టార్‌ను చేసిన సినిమా.. డీజే టిల్లు. ఈ చిత్రం మొదలైనపుడు, రిలీజవుతున్నపుడు పెద్దగా అంచనాలే లేవు. కానీ విడదుల తర్వాత అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. టిల్లు పాత్ర, సిద్ధు పెర్ఫామెన్స్ యువ ప్రేక్షకులకు బాగా ఎక్కేశాయి. ఇక ‘టిల్లు స్క్వేర్’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే.
ఈ రెండు చిత్రాల సక్సెస్‌లో నటుడిగానే కాక రైటర్‌గానూ సిద్ధు పాత్ర ఎంతో కీలకం. ఐతే ‘డీజే టిల్లు’ చేస్తుండగా చిత్రీకరణ మధ్యలో తాను దర్శకుడితో కలిసి డైలాగులను ఇంప్రొవైజ్ చేస్తుంటే.. మేనేజర్ అపార్థం చేసుకుని తన మీద నిర్మాత నాగవంశీకి కంప్లైంట్ చేసినట్లు సిద్ధు వెల్లడించాడు.
డీజే టిల్లు షూట్ జరుగుతుండగా.. నిర్మాత ఫోన్ చేసి ఏం చేస్తున్నావని సిద్ధు అడిగాడట. షూటింగ్‌లో ఉన్నామని చెబితే, మేనేేజర్ ఎందుకో ట్రిప్ అవుతున్నాడో చూసుకో అని చెప్పాడట సిద్ధు. షాట్ గ్యాప్‌లో తాను, దర్శకుడు విమల్ కృష్ణ పక్కకెళ్లి నవ్వుతూ కనిపించడంతో మేనేజర్.. తాము షూటింగ్ వదిలేసి జోకులేసుకుంటున్నామని మేనేజర్ భావించి నిర్మాతకు ఫోన్ చేసి కంప్లైంట్ చేసినట్లు సిద్ధు చెప్పాడు.
ఐతే వాస్తవం ఏంటంటే.. సినిమాలో హైలైట్ అయిన “నువ్వెళ్లి వాటర్ మెలాన్ ఆర్డర్ చేసుకుని చిల్ అవ్వు.. ఈ శవాలు పాతిపెట్టుడు నాకలవాటే” అనే డైలాగ్‌ను తాను విమల్‌కు చెప్పానని.. ఇలా డైలాగ్ చెబితే బాగుంటుంది కదా అంటే, అతను ఆ డైలాగ్‌కు నవ్వాడని సిద్ధు తెలిపాడు. నిజానికి జరిగింది ఇది అయితే.. తామిద్దరం షూట్ వదిలేసి జోకులేసుకుంటున్నామని మేనేజర్ అనుకున్నాడని.. ఇలా ఎవరి పర్సెప్షన్ వారికి ఉంటుందని.. వాస్తవంగా జరిగేది ఒకటని.. కాబట్టి దేని మీదా వెంటనే ఒక అంచనాకు వచ్చేయడకూడదని అన్నాడు సిద్ధు.