నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అమిగోస్, డెవిల్ సినిమాలు నిరాశపరిచాక.. బాగా టైం తీసుకుని ఈ మూవీ చేశాడు ఈ నందమూరి హీరో. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి రూపొందించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొన్ని వారాల ముందు వరకు ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు కానీ.. టీజర్ రిలీజయ్యాక ఒక్కసారిగా హైప్ వచ్చింది. ఇప్పుడు మంచి అంచనాల మధ్య సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్.. ఇంకా హైప్ పెంచే స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇందులో 20 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని.. ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ రాలేదని అతను ఘంటాపథంగా చెప్పాడు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో మేజర్ హైలైట్ ఏంటి యాంకర్ సుమ అడగ్గా.. ఇప్పుడీ మాట చెప్పొచ్చో లేదో.. ఈ స్టేట్మెంట్ ఇస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారో ఏమో తెలియదు. కానీ సినిమాలో చివరి 20 నిమిషాలు హైలైట్‌గా ఉంటుంది. ఇలాంటి క్లైమాక్స్ మన ఇండస్ట్రీలో ఇంత వరకు రాలేదని కచ్చితంగా చెప్పగలను.
ఇలాంటి సన్నివేశాలు మీరు ఇప్పటిదాకా చూసి ఉండరు. క్లైమాక్స్ చూశాక ప్రేక్షకులు కదిలిపోతారు. తల్లిని ప్రేమించే ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నేను ఇంత వరకు ఇలాంటి కథ చేయలేదు అని కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో విజయశాంతి నటించిన సంగతి తెలిసిందే. ఆమెది పోలీసాఫీసర్ పాత్ర. కొడుకు చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తుంటే.. అతణ్ని పట్టుకోవడానికి ప్రయత్నించే పాత్ర తనది. ఈ కాన్ఫ్లిక్ట్ పాయింటే సినిమాలో హైలైట్‌గా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నటించింది.