రాజా సాబ్….త్వరగా తేల్చేయండి ప్లీజ్

గత ఏడాది డిసెంబర్ అన్నారు. తర్వాత ఏప్రిల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు దసరా లేదా దీపావళికి రావడం అనుమానమే అంటున్నారు. పోనీ సలార్ లాగా డిసెంబర్ బాగుందనుకుంటే యూనిట్ నుంచి సరైన సమాచారం లేదు. తాజాగా 2026 సంక్రాంతి కూడా ఛాయస్ లో ఉందట. ఈ డిస్కషన్ అంతా ది రాజా సాబ్ గురించేనని చెప్పనక్కర్లేదు. ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ ఎంటర్ టైనర్ కు సంబంధించి కొంత టాకీ పార్ట్, నాలుగు పాటల షూటింగ్ బ్యాలన్స్ ఉందని టాక్. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ ప్యాన్ మూవీకి ఎప్పుడు మోక్షం దక్కుతుందనేది అభిమానుల్లో కలుగుతున్న ఆందోళన.

రాజా జాప్యం గురించి రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తుండటం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. బడ్జెట్ సమస్యలు, ప్రభాస్ అందుబాటులో లేకపోవడం, షెడ్యూల్స్ వాయిదా, ఆర్టిస్టుల కాల్ షీట్లు, విఎఫెక్స్ పనులు ఇలా చాలా కారణాలు అడ్డుగా నిలుస్తున్నాయని అంతర్గతంగా వినిపిస్తోంది. ఇదే బ్యానర్ నుంచి దీనికన్నా ఆలస్యంగా మొదలైన మిరాయ్ ఆగస్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా రాజా సాబ్ ఇంకా డోలాయమానంలోనే ఉండటం విచిత్రం. కాన్సెప్ట్ టీజర్, రెండు మూడు పోస్టర్లు తప్ప రాజా సాబ్ కు ప్రమోషనల్ కంటెంట్ ఏదీ బయటికి రాలేదు. కారణం పోస్ట్ పోన్ల వ్యవహారమే.

విపరీతమైన ఆలస్యం చేయడం వల్లే గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ విపరీతంగా ఉన్న బజ్ ని తగ్గించుకున్నాయి. ఒక్కసారి హైప్ దిగితే దాన్ని నిలబెట్టడం కష్టం. రాజా సాబ్ కు ఆ ఇబ్బంది ఉండదనే నిన్నటిదాకా అనుకున్నారు. కానీ ఇప్పుడు చక్కర్లు కొడుతున్న గాసిప్స్ ఫ్యాన్స్ కునుకుని దూరం చేసేలా ఉన్నాయి. హను రాఘవపూడి ఫౌజీ అంత వేగంగా షూటింగ్ జరుపుకుంటే రాజా సాబ్ కు ఎందుకు బ్రేక్ వేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. సుమారు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ ప్రాజెక్టు చాలా కీలకం.