రౌడీ కామెంట్.. బయటివారే బాలీవుడ్‌ను బతికిస్తారు

విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం ఎంత ఇబ్బందికరంగా ఉందో తెలిసిందే. లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి భారీ డిజాస్టర్లతో అతను బాగా డౌన్ అయిపోయాడు. ఐతే ఆ స్థితిలో ఉన్నవాడు బాలీవుడ్ డౌన్ ఫాల్ మీద తాజాగా చేసిన కామెంట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బాలీవుడ్ మళ్లీ పుంజుకుంటుందని.. ఆ ఇండస్ట్రీని వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పైకి తీసుకొస్తారని అతను కామెంట్ చేయడం విశేషం. దక్షిణాది సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న తీరు గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్ కూడా మళ్లీ పుంజుకుంటుందని అతను వ్యాఖ్యానించాడు. 

‘‘దక్షిణాది సినీ పరిశ్రమ ఇప్పుడు గొప్పగా రాణిస్తోంది. దేశ విదేశాల్లో సౌత్ సినిమా ఆదరణ పొందుతోంది. ప్రేక్షకులు మా సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకానొక సమయంలో ఇక్కడి సినిమాలకు సరైన గుర్తింపు ఉండేది కాదు. ఇది ఒక సర్కిల్ లాంటిది. రానున్న ఐదు పదేళ్లలో పరిస్థితులు మారొచ్చు. బాలీవుడ్లో ఇప్పుడు ఒక లోటు ఏర్పడింది. ఆ లోటును భర్తీ చేసేందుకు కొత్త దర్శకులు పుట్టుకొస్తారు. హిందీ పరిశ్రమ గ్రేట్ డైరెక్టర్లను అందిస్తుందని నమ్ముతున్నా. కానీ వాళ్లు ముంబయికి సంబంధం లేకుండా బయటి వారే అయ్యుంటారని అనిపిస్తోంది’’ అని విజయ్ తెలిపాడు.

‘బాహుబలి’తో రాజమౌళి ఇండియన్ సినిమాను మలుపు తిప్పిన తీరు గురించి విజయ్ స్పందిస్తూ.. సౌత్ నుంచి అలాంటి సినిమా ఒకటి వస్తుందని బాలీవుడ్ అస్సలు ఊహించి ఉండదని అన్నాడు. ఆ సినిమా తేడా కొడితే ఎంతోమంది కెరీర్లు ముగిసిపోయేవని.. నిర్మాతలు మునిగిపోయేవారని.. ఆ సినిమా కోసం ఒక్కొక్కరు ఐదేళ్ల పాటు కష్టపడ్డారని.. చివరికి అందరికీ మంచి ఫలితం దక్కిందని అన్నాడు విజయ్. హిందీ సినిమా పరిశ్రమ కూడా దీన్నుంచి స్ఫూర్తి పొందాలని.. కొత్త దారులను వెతుక్కుని ఉన్నత స్థాయికి చేరాలని అతను పిలుపునిచ్చాడు.