మ్యాడ్ స్క్వేర్ రివ్యూలు, కలెక్షన్లు బాగున్న తర్వాత కూడా ఒక వర్గం మీడియా నుంచి మద్దతు లేకపోవడం గురించి నిర్మాత నాగవంశీ నిర్వహించిన ప్రెస్ మీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కావాలంటే నా సినిమాలను బ్యాన్ చేసుకోండి, కవరేజ్ ఇవ్వకండి, యాడ్స్ తీసుకోకండి, ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసంటూ కొంచెం హెచ్చు స్వరంలోనే చెప్పడం ఆశ్చర్యపరిచేలా జరిగింది. రివ్యూలు ఎలాగైనా రాసుకోవచ్చని, కానీ జనం ఆదరించిన తర్వాత కొందరు దాని గురించి పబ్లిక్ లోకి తీసుకెళ్లకుండా అక్కసు వెళ్లగక్కడం గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం సోషల్ మీడియాలోనూ వైరలవుతోంది.
నాగవంశీ ఆవేదన, ఆవేశంలో కనిపించే కనిపించని కోణాలు రెండున్నాయి. మ్యాడ్ స్క్వేర్ ని ఆడియన్స్ ఆదరించారు. అందులో ఎలాంటి సందేహం లేదు. బడ్జెట్ పరంగా చాలా పెద్దవైన మిగిలిన మూడు పోటీ సినిమాల కన్నా తెలుగులో దీనికే ఆదరణ ఎక్కువ దక్కిందనేది కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. ఆదివారం దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడిన వైనాన్ని నిన్న ప్రస్తావించడం జరిగింది. రివ్యూల తీర్పుల ప్రకారం ప్రతిసారి బాక్సాఫీస్ ఫలితాలు రావు. ఆ మాటకొస్తే పుష్ప 2, యానిమల్, ఆర్ఆర్ఆర్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ల విషయంలోనూ ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం చేసినవాళ్లున్నారు. కానీ వాటి వల్ల వచ్చిన నష్టమేమీ లేదు.
పిక్చర్ బాగుండి ఆడుతున్నప్పుడు ఎవరేం అన్నా అనకపోయినా ఆడేది ఆడకుండా ఆగిపోదు. ఒకవేళ మొదటి రోజు టాక్ గురించి కన్ఫ్యూజ్ అయినా తర్వాత నిజం తెలుసుకుని ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఇది ఎన్నోసార్లు ఋజువైన సత్యం. రివ్యూల ప్రభావం లేకుండా పోదు. అయితే అది ఒక బాగున్నా సినిమాని ఆపేందుకు మాత్రం సాధ్యం కాదు. బాలేని సినిమాను నిలబెట్టడం కుదరదు. ఒక వారథిగా అభిప్రాయాన్ని వ్యక్తపరచడమే తప్ప ఇదే శాసనమనే రీతిలో ఉండదు. అలాంటప్పుడు దాని గురించి బోలెడు టెన్షన్లుండే నిర్మాతలు ఆలోచించడం లేనిపోని భారాన్ని కలిగిస్తుంది.
పరస్పర సహకారం తీరులో నడుస్తున్న ఇండస్ట్రీ, మీడియా రెండూ అనుసంధానంతో కొనసాగాల్సిందే. మాయాబజార్ కాలం నుంచి ఇప్పటి మ్యాడ్ స్క్వేర్ దాకా ఈ చేయూత ధోరణే ఒక బ్రిడ్జ్ లాగా నడిపిస్తుంది. అంతే తప్ప ఎవరి దారి వారిదనే భీష్మ ప్రతిజ్ఞలు ఎల్లకాలం నిలబడవు. సోషల్ మీడియా కాలంలో ప్రింట్ కున్న ప్రాధాన్యతే వెబ్ కూ పెరిగింది. అందుకే యాభై అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన పబ్లిషింగ్ సంస్థలు సైతం డిజిటల్ దారి పడుతున్నాయి. ఇదంతా పక్కనపెడితే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత లాభాల నిష్పత్తిలో చూసుకుంటే మ్యాడ్ స్క్వేర్ ఈ ఏడాది అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలవడం ఖాయమే.