ఇదేం చిత్రమైన కాంబినేషన్?


టాలీవుడ్లో ఎవ్వరూ ఊహించని ఒక కాంబినేషన్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ కింగ్‌గా అభిమానులు పిలుచుకునే తమిళ సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటించనున్నాడట. చైతూ హీరోగా ఒక భారీ యాక్షన్ సినిమా చేయాలని అర్జున్ భావిస్తున్నాడట. అక్కినేని వారసుడికి కథ కూడా చెప్పాడని.. అతను ఆసక్తితోనే ఉన్నాడని.. త్వరలోనే దీని గురించి ప్రకటన ఉండొచ్చని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ఇది చూసి అర్జున్ ఏంటి.. చైతూను డైరెక్ట్ చేయడమేంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అర్జున్‌కు దర్శకత్వంలో అనుభవం లేకుండా ఏమీ లేదు. ‘జైహింద్’తో పాటు తాను హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా వరకు పోలీస్-దేశభక్తి కథలే. ఐతే హీరోగా సినిమాలు తగ్గించేశాక దర్శకత్వానికి దూరం అయిపోయాడు అర్జున్. ఇప్పుడు అర్జున్ నటించడమే తగ్గిపోయింది.

ఇలాంటి సమయంలో మళ్లీ దర్శకత్వం అంటుండటం, అది కూడా మన చైతన్యను హీరోగా పెట్టి యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడన్న ప్రచారం ఆశ్చర్యం కలిగిస్తోంది. చైతూకు యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని మహా సరదా. కెరీర్ ఆరంభం నుంచి ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురవుతోంది. దీంతో తనకు సెట్టయ్యే లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పరిమితం అవుతున్నాడు.

చివరగా చైతూ చేసిన యాక్షన్ మూవీ ‘యుద్ధం శరణం’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ తర్వాత ఆ జానర్ జోలికి వెళ్లలేదు. గత ఏడాది ‘మజిలీ’తో విజయాన్నందుకున్న అతను.. ‘లవ్ స్టోరి’ పేరుతో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరో ప్రేమకథ చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఇటీవలే ‘థ్యాంక్యూ’ సినిమాను కూడా మొదలుపెట్టాడు. మరి అర్జున్‌తో అతడి సినిమా అంటూ వస్తున్న వార్తలు ఎంత వరకు నిజమో చూడాలి.