మొన్న గురువారం విడుదలైన ఎల్2 ఎంపురాన్ వివాదాలకు అంత సులభంగా శుభం కార్డు పడేలా లేదు. ఇతర భాషల్లో ఫ్లాప్ అయినా మలయాళంలో బ్లాక్ బస్టర్ దిశగా రికార్డులు నమోదు చేస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో పలు సన్నివేశాలు, పాత్రల పేర్ల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఏకంగా హీరో మోహన్ లాల్ పబ్లిక్ గా క్షమాపణ చెప్పి అవన్నీ తీసేస్తామని చెప్పే దాకా పరిస్థితి వెళ్ళిపోయింది. మధ్యలో దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ స్పందించలేని పరిస్థితిలో మౌనాన్ని ఆశ్రయించాడు. తాజాగా అతని తల్లి మల్లిక ఈ కాంట్రవర్సీ గురించి సుదీర్ఘమైన పోస్టులో సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఆవిడ చెప్పిన ప్రకారం ఎంపురాన్ స్క్రిప్ట్ పని చేసిన ప్రతి ఒక్కరు చదివారు. మోహన్ లాల్ సినిమా చూడలేదు, తనకు తెలియకుండా కొన్ని ఎపిసోడ్లు తీశారనేది పచ్చి అబద్దం. పృథ్విరాజ్ ని అందరూ బలిపశువుని చేయాలని చూస్తున్నారు. హీరోకు, నిర్మాతలకు తెలియకుండా ఏదో కుట్ర జరుగుతోంది. ఎల్2 వెనుక ఏం జరిగిందనేది మల్లికకు పూర్తిగా తెలుసు. ఒకవేళ స్క్రిప్ట్ లో సమస్యలు ఉంటే దానికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి తప్ప పృథ్విరాజ్ ఒక్కడే కాదు. రచయిత కూడా ఎల్లప్పుడూ పక్కనే ఉండేవారు. అవసరమైనప్పుడు మార్పులు చేర్పులు జరిగేవి. మరి పృథ్విరాజ్ ఒక్కడే ఎలా తప్పు చేసినట్టే.
మల్లిక గారి ప్రశ్నల్లో తర్కం ఉంది కానీ సినిమా ఫలితం ఏదైనా, దానికి ముసురుకున్న వివాదం ఎలాంటిదైనా ముందుగా అందరి వేళ్ళు వెళ్ళేది దర్శకుడి వైపే. అందుకే పృథ్విరాజ్ సుకుమారన్ టార్గెట్ అయ్యాడు. ఫలానా మతాన్ని కించపరిచేలా ఏదైనా ఉందనిపించినప్పుడు దానికి సంబంధించిన నిర్ణయం విడుదలకు ముందే తీసుకోవాలి. ఇప్పుడు పదిహేను కట్లు చేసి, పాత్రల పేర్లు మార్చినంత మాత్రాన డ్యామేజ్ పూర్తిగా తగ్గదు. ఆల్రెడీ మొదటి నాలుగైదు రోజులు చూసినవాళ్ల మనసులో డిలీట్ చేయలేరుగా. ఈ వ్యవహారం ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో అంతు చిక్కడం లేదు.