టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హఠాత్తుగా మళ్ళీ పుకార్లు మొదలైపోయాయి. హైదరాబాద్ కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం కుదిరిందని, త్వరలోనే మూడు ముళ్ళు వేయబోతున్నాడని నిన్న కొన్ని మీడియా కథనాల్లో రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఎలాంటి నిజం లేదు. గతంలోనూ ఇలాగే ఓ భీమవరం ఇండస్ట్రియలిస్ట్ తనయతో సంబంధం కుదిరిందని జోరుగా ప్రచారం చేశారు. కట్ చేస్తే అలాంటిదేమి లేదని తేలింది. ఇప్పుడొచ్చిన గాసిప్ కూడా అదే కోవలోది తప్ప ఎలాంటి నిజం లేదని ప్రభాస్ వర్గం వెర్షన్.
ప్రస్తుతం ప్రభాస్ వయసు 45. తన సమకాలీకులు అందరూ ఓ ఇంటివారైపోయారు. కొందరి పిల్లలు టీనేజ్ కూడా వచ్చేశారు. కానీ డార్లింగ్ మాత్రం నో మ్యారేజ్ అంటూ సినిమాలే ప్రపంచంగా ఉంటున్నాడు. పెదనాన్న కృషంరాజు గారు ఉన్నప్పుడే ఈ ముచ్చట తీర్చుకోవాలని చాలా ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఆయన కన్నుమూశాక శ్యామలదేవి గారు సైతం అదే పనిలో ఉన్నారు కానీ ఎంతకీ తెమలడం లేదు. ఇతర స్టార్లు ఒక్కో సినిమాకు ఏడాదికి పైగా టైం తీసుకుంటూ ఉంటే ప్రభాస్ మాత్రం ఒకే టైంలో రెండు మూడు సెట్స్ మీద ఉంచి నిమిషం ఖాళీ లేకుండా చూసుకుంటున్నాడు.
సో ఏతావాతా ఫైనల్ గా తేలేది ఏమిటంటే ప్రభాస్ తానుగా శుభవార్త చెబితే తప్ప ఈ గాసిప్స్ కి శుభం కార్డు పడదు. గతంలో అనుష్కతోనే లగ్గమవుతుందని వార్తలు తిరిగి ఫ్యాన్స్ అది నిజమేమో అని నమ్మేదాకా వచ్చారు. ఆశ్చర్యకరంగా నాలుగు పదుల వయసు దాటినా స్వీటీ కూడా ఇంకా బ్రహ్మచారిగానే ఉంది. ఘాటీ ప్రమోషన్లు మొదలైనప్పుడు దీనికి సంబంధించిన టాపిక్ ఏమైనా వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత స్పిరిట్ సెట్స్ లో అడుగు పెడతాడు. అటుపై కల్కి 2, సలార్ 2 శౌర్యంగ పర్వం ఉంటాయి. ఒకవేళ రాజాసాబ్ కనక బ్లాక్ బస్టరైతే దానికీ కొనసాగింపు ఉంటుంది.