ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించి సోషల్ మీడియా మంచి డిస్కషన్లు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఊరమాస్ లుక్ లో చరణ్ మెప్పించినప్పటికీ పోలికల పరంగా పుష్పకు దగ్గరగా ఉండటం గురించి పలువురు చర్చించుకుంటున్నారు. అందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే పుష్పలో అల్లు అర్జున్, పెద్దిలో రామ్ చరణ్ ని పక్కపక్కన పెట్టి చూస్తే ఒక్క చుట్ట మినహాయించి రెండు లుక్స్ దగ్గరగా అనిపిస్తాయి. అయితే బుచ్చిబాబు ఇలా డిజైన్ చేయడానికి కారణం గురువు సుకుమార్ ప్రభావమే. అంతగా ఫాలో అయిపోయాడు మరి.
పెద్దిలో రామ్ చరణ్ పాత్ర వృత్తి ఆటకూలి. అంటే ఎవరు ఏ ఆటకు పిలిస్తే వెళ్లి వాళ్ళ తరఫున గెలిచి వచ్చి డబ్బులు తీసుకుంటాడు. పెద్ది అంటే ప్రైజ్ గ్యారెంటీ అనేలా పేరు తెచ్చుకుంటాడు. అలాంటోడి జీవితంలో ఏం జరిగింది. రకరకాల ఆటలు ఆడే ఇతనితో ఆటాడుకున్న విలన్లు ఎవరు అనేది అసలు పాయింట్ గా చెబుతున్నారు. ప్రమోషన్లు పెరిగే కొద్దీ దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది కానీ ప్రస్తుతానికి ఫ్యాన్స్ కి బాగా నచ్చేసిన పెద్ది న్యూట్రల్ మూవీ లవర్స్ నుంచి కొంత మిశ్రమ స్పందన తెచ్చుకుంది. నిన్న టీజర్ లో ఒక షాట్ వెయ్యిసార్లు చూడొచ్చనేలా ఉంటుందనే నిర్మాత మాట అంచనాలు పెంచేసింది.
పోస్టర్ సంగతి పక్కనపెడితే మేకింగ్ లోనూ బుచ్చిబాబు గురువుని ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఉప్పెనలోనే ఆ షేడ్స్ కనిపించాయి. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సినిమా కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకుని సుకుమార్ ని మించిన ముద్ర వేసేందుకు బుచ్చిబాబు కష్టపడతాడు. సన్నిహితులు చెప్పిన ప్రకారమైతే ప్రస్తుతం షూట్ చేస్తున్న ఎపిసోడ్స్ చాలా బాగా వస్తున్నాయట. ఏఆర్ రెహమాన్ సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కనక న్యాయం చేయగలిగితే ఈసారి బ్లాక్ బస్టర్ ఖాయమని అంటున్నారు. విడుదల మాత్రం ఈ ఏడాది ఉండబోవడం లేదు. ఉగాదికి వచ్చే టీజర్ లో అనౌన్స్ మెంట్ ఉంటుంది.