చిరుతో వెంకీ సినిమా ఎందుకు అవ్వలేదు?

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి కొత్త దర్శకుడికీ ఓ కల. ఒక తరాన్ని ఊపు ఊపి అనేక రకాలుగా స్ఫూర్తి నింపిన తిరుగులేని హీరో ఆయన. ఎంతోమంది ఇండస్ట్రీలోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన చిరు.. తనను అమితంగా అభిమానించే యువ దర్శకులకు తనతో సినిమా చేసే అరుదైన అవకాశం కల్పిస్తున్నాడు. బాబీ అలాగే కలను నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి వంతు వచ్చింది. ఐతే అనిల్ కంటే ముందే, బాబీతో పాటుగానే చిరు నుంచి పిలుపు అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల.

‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో సూపర్ హిట్లు ఇవ్వడంతో ఈ యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి చిరు ఆసక్తి కనబరిచాడు. యువి క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. చిరు సినిమా చేజారడంతో కొంచెం గ్యాప్ తీసుకుని ‘రాబిన్ హుడ్’ చేశాడు వెంకీ. ఇంతకీ చిరు చిత్రం ఏమైందనే విషయమై మీడియాతో మాట్లాడాడు వెంకీ. ‘‘భీష్మ తర్వాత చిరంజీవి గారి కోసం కథ రాశాను. ఆయనకు బేసిక్ ఐడియా చాలా నచ్చింది. స్క్రిప్టు రెడీ చేసుకుని రమ్మన్నారు. స్వతహాగా నేను చిరు అభిమానిని.

ఆయనతో చేసే సినిమా అద్భుతంగా ఉండాలని అనేక అంశాలను జోడించి చాలా టైం తీసుకుని స్క్రిప్టు రెడీ చేశా. కానీ అది ఎక్కడో ఆయనకు సంతృప్తినివ్వలేదు. దీంతో ఇంకో కథ చేసుకుని వస్తానని చెప్పి వచ్చేశా. ఇంతలో నితిన్ అన్నను కలిశాను. నా దగ్గర అప్పటికే ఉన్న ఓ కథ ఐడియా గురించి చెబితే ఓకే అన్నారు. ఆయనకు తగ్గట్లుగా ఆ ఐడియాను స్క్రిప్టుగా మలిచి ‘రాబిన్ హుడ్’ చేశా. చిరుతో ఇంతకుముందు సినిమా అవకాశం మిస్సయినప్పటికీ.. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేస్తాననే ఆశిస్తున్నా’’ అని వెంకీ తెలిపాడు.