వాయిదాల వ్యూహంలో యువి క్రియేషన్స్

ప్రభాస్ కు అత్యంత సన్నిహితమైన బ్యానర్ గా ఇంకా చెప్పాలంటే అతని స్వంత సంస్థలా ఇండస్ట్రీ భావించే యువి క్రియేషన్స్ తన ప్యాన్ ఇండియా సినిమాల విడుదల విషయంలో వాయిదాల పర్వంలో చిక్కుకుంటోంది. తాజాగా అనుష్క ‘ఘాటీ’ని ఏప్రిల్ 18 నుంచి తప్పించేసి కొత్త డేట్ కోసం వెతుకుతున్నారు. విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించిన కొన్ని పనులు ఆలస్యం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఇన్ సైడ్ టాక్. టీజర్ వచ్చాక ఘాటీ మీద అంచనాలు పెరిగాయి. దర్శకుడు క్రిష్ మొదటిసారి డార్క్ క్రైమ్ జానర్ ఎంచుకోవడం ఆసక్తి రేపింది. కానీ ఇప్పుడీ బ్రేక్ ఎప్పుడు క్లియరవుతుందో చూడాలి.

దీనికన్నా ముందు ‘విశ్వంభర’ది ఇదే పరిస్థితి. జనవరి 10 రిలీజ్ డేట్ ఎప్పుడో గత ఏడాదే ప్రకటించి గత డిసెంబర్ లో పోస్ట్ పోన్ ప్రకటించారు. గేమ్ ఛేంజర్ కోసం త్యాగం చేసినట్టు చెప్పుకున్నారు కానీ నిజానికి అప్పటికి బోలెడంత వర్క్ పెండింగ్ ఉండిపోయింది. పోనీ ఏప్రిల్ లో వస్తుందేమో అనుకుంటే ఆ ఛాన్స్ కూడా లేదు. జూన్ లేదా జూలై అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నా స్పష్టమైన సమాధానం లేదు. ఓటిటి డీల్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ జాప్యానికి కారణంగా వినిపిస్తోంది. ఏకంగా ఆగస్ట్ 22 చిరంజీవి బర్త్ డేకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం మొదలైపోయింది. సో వెయిటింగ్ గేమ్ ఇంకా కొనసాగబోతోంది.

ఇదే కాదు అఖిల్ తో అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ చిత్రీకరణ మొదలుకాకుండానే హోల్డ్ లో ఉంది. ఇది లేట్ అవుతోందనే ఉద్దేశంలో లెనిన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం రచయిత నందు కథకు సానుకూలంగా స్పందిస్తున్నాడనే వార్తలు ఉన్నాయి. శర్వానంద్ తో చేస్తున్న రోడ్ థ్రిల్లర్ సైతం వేగంగా పరుగులు పెట్టట్లేదు. తాజాగా వరుణ్ తేజ్ – మేర్లపాక గాంధీ సినిమాను మొదలుపెట్టారు. ఇది ఫాస్ట్ గానే జరిగేలా ఉంది. కొరియన్ కనకరాజు టైటిల్ ప్రచారంలో ఉంది. ఇవన్నీ సెట్ చేసుకోగలిగితే 2025 యువి క్రియేషన్స్ కి గోల్డెన్ జాక్ పాట్ అవుతుంది.