హాట్ టాపిక్ : మీడియం సినిమాలకు టికెట్ హైక్

ప్యాన్ ఇండియా సినిమాలకు బడ్జెట్ పెరిగినప్పుడు దాన్ని థియేటర్ రెవెన్యూ ద్వారా రికవర్ చేసుకోవాలంటే టికెట్లు రేట్లు కొంత సమయం పాటు పెంచుకోవడం అవసరమే. లేదంటే ఆర్ఆర్ఆర్, పుష్ప, బాహుబలి, కెజిఎఫ్ లాంటి రిస్కులు నిర్మాతలు చేయలేరు. కానీ ఈ సూత్రం మీడియమ్ రేంజ్ చిత్రాలకు వర్తించదు. ఎందుకంటే హిట్ టాక్ వస్తే వీటికయ్యే ఖర్చు సులభంగా వెనక్కు రావడమే కాక లాభాలు కూడా ఇస్తుంది. ఇటీవలే కోర్ట్ చూశాంగా. అలా కాకుండా అవకాశం ఉంది కదాని ప్రభుత్వాన్ని పర్మిషన్లు అడిగేసి టయర్ 2 మూవీస్ కూడా హైక్ తెచ్చుకుంటేనే అసలు సమస్య వస్తుంది. ఇప్పుడీ టాపిక్ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ గురించి.

నితిన్ నటించిన రాబిన్ హుడ్ కు ఏపి ప్రభుత్వం సింగల్ స్క్రీన్ 50, మల్టీప్లెక్స్ 75 రూపాయల చొప్పున ప్రతి టికెట్ మీద ఏడు రోజుల పాటు పెంచుకోవడానికి జిఓ జారీ చేసింది. మ్యాడ్ స్క్వేర్ కు కూడా రావొచ్చని ఇండస్ట్రీ టాక్. రాబిన్ హుడ్ కు కాస్త ఎక్కువ బడ్జెట్ అయ్యింది. కాదనడం లేదు. అలాని మరీ వందల కోట్లయితే కాదు. అలాంటప్పుడు టికెట్ పెంపు ఎందుకనే ప్రశ్న సగటు ప్రేక్షకుల్లోనూ మెదులుతుంది. సినిమా బాగుంటే ఎలాగూ థియేటర్లు నింపేసి మరీ ఆడియన్స్ చూస్తారు. అందులో సందేహం లేదు. ఒకవేళ నమ్మకం లేక ముందు జాగ్రత్తగా ఇలా పెంచుకుంటారా అనే అనుమానం వచ్చే అవకాశం లేకపోలేదు.

తెలుగు జనాల సినిమా ప్రేమను క్యాష్ చేసుకోవడం ఎంత వరకు సబబనేది ఆలోచించుకోవాలిగా. రాబిన్ హుడ్ నిర్మాతల పుష్ప 2కి ఎంత పెంచినా పబ్లిక్ అంగీకరించారంటే అది అంత వర్త్ అనిపించింది కాబట్టి, బన్నీ మార్కెట్ ఆ స్థాయికి పెరిగింది కాబట్టి. కానీ నితిన్ కో లేదా ఇంకా సెటిల్ కాని మ్యాడ్ స్క్వేర్ ముగ్గురు హీరోలకు ఇది వర్తించదు. అలాంటప్పుడు మాములు రేట్లు పెట్టి సినిమా చూపిస్తే ఎక్కువ శాతం చూసే అవకాశం దక్కుతుంది. ఇలా పెంచుకోవడం వల్ల రిపీట్ అభిమానులను ఆపేసినట్టే. బడ్జెట్ తో ఇప్పుడీ ఏపీ జీవో వల్ల హైదరాబాద్ కన్నా విజయవాడలో సింగల్ స్క్రీన్ టికెట్ రేట్ ముప్పై రూపాయలు పెరుగుతోంది. అయితే లాజిక్ ప్రకారం అన్నింటి కంటే ఎక్కువ ఖర్చు పెట్టిన ఎల్2 ఎంపురాన్ కూడా రేట్లు పెంచుకోవాలి. మరి చేయలేదే. డబ్బింగ్ కదాని తీసిపారేయలేం. గతంలో కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ అనువాదాలకు హైక్ తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి.

ఎక్కువ పెట్టి చూడమని మేం బలవంతం చేయలేదే అని కొందరు వాదించవచ్చు. లేదా వారం ఆగండి కొంపలేం మునగవు కదానే ఆర్గుమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ముందే చెప్పినట్టు సినిమా అనేది తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన బలహీనత. దాన్ని ఆస్వాదించే క్రమాన్ని ఆలస్యం చేయటానికి ఇష్టపడరు. వాళ్ళను గౌరవించాలంటే రేట్ల విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించాలి. పెద్ద సినిమాలకు ముక్కుపిండి తీసుకోండి. అభిమానులు అర్థం చేసుకుంటారు. ప్రతి సినిమాకు పెంచుకుంటామంటే ఓటిటి వైపు చూస్తారు. థియేటర్లు బాగుండాలి, సినిమాలు తీసే నిర్మాతలకు డబ్బులు రావాలి. అవి కంటెంట్ తో జరుగుతాయి తప్ప హైకులతో కాదు.