ప్రస్తుతం ఇండియాలో మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకడు. పేరుకు మలయాళ నటుడే కానీ.. అతను బహు భాషల్లో నటిస్తున్నాడు. ఓవైపు మలయాళంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూనే.. ఇంకోవైపు ఇతర భాషల్లో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ‘సలార్’ లాంటి మెగా మూవీలో కీలక పాత్ర చేసిన అతను.. మహేష్ బాబు-రాజమౌళి చిత్రంలోనూ కీ రోల్ పట్టేసిన సంగతి తెలిసిందే. నటుడిగా ఇంత బిజీగా ఉంటూ కూడా పృథ్వీరాజ్ దర్శకత్వమూ చేస్తుండడం విశేషం. ఇప్పటికే లూసిఫర్, బ్రో డాడీ రూపంలో రెండు హిట్లు ఇచ్చాడు. ఇప్పుడు తన నుంచి రాబోతున్న ‘లూసిఫర్’ సీక్వెల్ ‘ఎల్-2: ఎంపురాన్’కు క్రేజ్ మామూలుగా లేదు.
ఈ స్థాయిలో ఉన్న పృథ్వీరాజ్.. తనకూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కారు ఈఎంఐ కడుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. అందరిలాగే నటీనటులకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని.. తనకూ కారు ఈఎంఐ ఉందని పృథ్వీరాజ్ వెల్లడించాడు. దర్శకత్వం అన్నది తాను ఆర్థిక పరంగా తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయమని అతను వ్యాఖ్యానించడం విశేషం. ‘ఎల్-2: ఎంపురాన్’ కోసం తాను రెండేళ్లు కేటాయించానని.. ఆ సమయంలో నటుడిగా ఎన్నో సినిమాలను పక్కన పెట్టాల్సి వచ్చిందని.. ఆ సినిమాల్లో నటించి ఉంటే తనకు చాలా డబ్బు వచ్చేదని చెప్పాడు. తాను డబ్బు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదని.. కానీ కమర్షియల్స్ మాత్రం చేశానని పృథ్వీరాజ్ చెప్పాడు.
యాడ్స్ కోసం రెండు గంటలు షూటింగ్‌లో పాల్గొన్నా చాలా డబ్బు ఇచ్చేవారని.. కానీ తాను ప్రమోట్ చేసే ఉత్పత్తుల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటానని పృథ్వీరాజ్ స్పష్టం చేశాడు. తన తండ్రి సుకుమారన్ దర్శకత్వం చేయాలని ఎంతో ఆశపడ్డారని.. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయారని చెప్పిన పృథ్వీరాజ్.. తన సక్సెస్ చూసేందుకు పక్కన లేకపోవడం ఎంతో బాధ కలిగించే విషయమని అన్నాడు. దర్శకుడిగా రజినీకాంత్‌తో సినిమా చేయలన్నది తన కల అని.. అందుకోసం ఒక ఐడియా కూడా ఉందని.. కథ సిద్ధం చేయాల్సి ఉందని పృథ్వీరాజ్ తెలిపాడు.