దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే ప్యాన్ ఇండియా సినిమా తాలూకు ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల ఏప్రిల్ 8 బన్నీ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం దుబాయ్ లో దీనికి సంబంధించిన చర్చలతోనే హీరో దర్శకుడి బృందాలు బిజీగా ఉన్నట్టు తెలిసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాల్సిన ఫాంటసీ మూవీకి ఇంకాస్త ఎక్కువ టైం పట్టేలా ఉంది కాబట్టి ఈలోగా ఆరేడు నెలల్లో అట్లీ మూవీ పూర్తి చేసేలా ప్రణాళిక వేస్తున్నారట. అయితే అట్లీకి కథలపరంగా ఒక ఫార్ములా సెంటిమెంట్ ఉంది.
తన గత మూడు సినిమాల్లో హీరో ద్విపాత్రాభినయం ఉంటుంది. ‘జవాన్’లో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులగా దర్శనమిచ్చాడు. ‘బిగిల్’ (విజిల్) లో లో విజయ్ చేసింది ఇదే. ‘మెర్సల్’ (అదిరింది) లోనూ దీన్ని వదిలిపెట్టలేదు. అంతకు ముందు ‘తేరి’లో డబుల్ ఫోటో కాకపోయినా బేకరీ ఓనర్, పోలీస్ ఆఫీసర్ గా విజయ్ కి రెండు షేడ్స్ పెట్టాడు. డెబ్యూ చేసిన ‘రాజా రాణి’ వీటికి భిన్నంగా ప్రేమకథ కాబట్టి అందులో డ్యూయల్ రోల్ లేదు. సో ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే చిత్రంలోనూ అట్లీ ఇదే ఫాలో అవుతున్నట్టు వినికిడి. కాకపోతే రెండో పాత్రకు కొంచెం నెగటివ్ టచ్ ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతానికి ఇవన్నీ పుకార్ల దశలోనే ఉన్నాయి కానీ ఒక్కసారి ప్రాజెక్టు పట్టాలు ఎక్కితే ఒక్కోదానికి సంబంధించిన స్పష్టత వస్తుంది. హీరోయిన్ ఎవరనేది కూడా గుట్టుగా ఉంచుతున్నారు. ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి కానీ అట్లీ ఎవరిని లాక్ చేయలేదని అంటున్నారు. నయనతార ఆప్షన్ వైపు బన్నీ ఆసక్తి చూపించలేదని టాక్. శ్రీలీల ఇప్పటిదాకా తనకు మెయిన్ లీడ్ గా చేయలేదు కాబట్టి తనో ఛాయస్ గా మారొచ్చు. దర్శకుడిగా జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతగా బేబీ జాన్ తో చేతులు కాల్చుకున్న అట్లీకి ఇప్పుడు బన్నీ మూవీ చాలా కీలకం. పుష్ప బ్రాండ్ ని నిలబెట్టే కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది.