హీరోతో డేటింగ్ చేయకూడదని హీరోయిన్‌కు కండిషన్

ఒక సినిమాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంగీకారం తెలిపినపుడు అడ్వాన్స్ ఇస్తూ అగ్రిమెంట్ మీద ఇరు పక్షాలు సంతకాలు చేసుకోవడం మామూలే. ఆ అగ్రిమెంట్‌లో రకరకాల కండిషన్లు కూడా ఉంటాయి. అవి అన్నీ చదివేవాళ్లు తక్కువ. తాను కూడా ఒక సినిమాకు అలాగే చూడకుండా సంతకం పెట్టానని.. కానీ తర్వాత అందులో ఉన్న ఒక కండిషన్ తెలిసి ఆశ్చర్యపోయానని అంటోంది తెలుగులో పాపులర్ అయిన బాలీవుడ్ భామ నిధి అగర్వాల్. నాగచైతన్య మూవీ ‘సవ్యసాచి’తో తెలుగులోకి అడుగు పెట్టిన నిధి.. అంతకంటే ముందు ‘మున్నా మైకేల్’తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకు తాను సంతకం చేసిన అగ్రిమెంట్లో.. హీరోతో డేట్ చేయకూడదనే కండిషన్ ఉన్న విషయం ఆలస్యంగా తెలిసిందని నిధి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

‘‘మున్నా మైకేల్‌తో నా కెరీర్ ఆరంభమైంది. ఆ హిందీ చిత్రంలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించాడు. ఆ సినిమాకు ఓకే చెప్పాక టీం నాతో ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయించింది. సినిమాకు సంబంధించి నేను పాటించాల్సిన విధి విధానాలు అందులో ఉన్నాయి. సంతకం చేసినపుడు నేను అందులో ఏముందో పెద్దగా చదవలేదు. కానీ తర్వాత నాకు ఓ విషయం తెలిసింది.

‘నో డేటింగ్’ అని షరతు పెట్టారు. సినిమా పూర్తయ్యే వరకు హీరోతో డేట్ చేయకూడదన్నది దాని సారాంశం. ఇది తెలిసి ఆశ్చర్యపోయా. ప్రేమలో పడితే పని మీద దృష్టిపెట్టరని.. ఆ టీం భావించి ఉండొచ్చు. అందుకే ఆ కండిషన్ పెట్టారేమో’’ అని నిధి వెల్లడించింది. బాలీవుడ్లో ఒక సినిమా చేస్తూ ప్రేమలో పడిన జంటలు చాలానే ఉన్నాయి. ఐతే ‘మున్నా మైకేల్’ చేసే సమయానికి టైగర్‌కు దిశా పఠాని గర్ల్ ఫ్రెండ్‌గా ఉండేది. కానీ తర్వాత ఈ జంట విడిపోయింది. నిధికి అయితే ఇప్పటిదాకా బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు ఎలాంటి రూమర్లు రాలేదు.