పోలీసు విచారణలో విష్ణు ప్రియ : ఏం జరిగిందంటే…

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అంతకంతకూ సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. యాప్స్ మాయలో పడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై దృష్టి సారించారు. వారిపై కేసులు నమోదు చేశారు. విచారణకూ పిలిచేశారు. ఈ క్రమంలో గురువారం పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ మొత్తం పూసగుచ్చినట్లుగా వివరాలు బయటపెట్టేసింది.

అదేదో సామెత చెప్పినట్లుగా ఇలా అడగ్గానే… అలా మొత్త చెప్పేసినట్లుగా విష్ణుప్రియ పోలీసుల విచారణలో ఏ ఒక్క అంశాన్ని కూడా దాచుకోకుండా నిజాయతీగా వ్యవహరించిందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. తాను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన మాట వాస్తవమేనని ఒప్పేసుకున్న విష్ణుప్రియ.. ఆ ప్రమోషన్ ద్వారా తాను భారీ ఎత్తున డబ్బు తీసుకున్నట్లుగా కూడా వెల్లడించింది. 15 బెట్టింగ్ యాప్స్ కు తాను ప్రమోషన్ చేసినట్లుగా ఆమె ఒప్పుకుందని సమాచారం

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం తన ఇన్ స్టాగ్రాం ఖాతాను వినియోగించినట్లు విష్ణుప్రియా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంలో తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పేశానన్న విష్ణుప్రియ.. అంతకుమించి తనకేమీ తెలియదని చెప్పింది. దీంతో విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్ మెంట్లతో పాటు ఆమె మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నోటీసుల మేరకు గురువారం ఉదయం తన న్యాయవాదిని వెంటబెట్టుకుని విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చింది. మధ్యాహ్నం లోగానే విచారణను ముగించిన పోలీసులు ఆమెను వదిలిపెట్టారు.