`బెట్టింగ్ యాప్` వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ యాప్‌ల కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పెట్టుబడులు పెట్టి.. మోసపోతున్న విషయం తెలిసిందే. దీంతో వారు ఆర్థిక కష్టాలు తాళలే క.. రుణ గ్రహీతల నుంచి వస్తున్న వత్తిళ్లు తట్టుకోలేక.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు చేస్తున్నారు.
తొలుత.. బెట్టింగ్ యాప్‌లపై యువతకు, మధ్యతరగతి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్నవారిపై కేసులు పెడుతున్నారు. అలానే.. ఈ యాప్‌లను ప్రచారం చేస్తూ.. బెట్టింగ్‌యాప్‌లకు ప్రచార కర్తలుగా ఉంటున్న ప్రముఖుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
మియాపూర్ కు చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రముఖ హీరో దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, యాంకర్లు సిరిహన్మంత్, శ్రీముఖి, వర్షిణి, శ్యామల సహా.. యూట్యూబర్లు బయ్యా సన్నీయాదవ్, ఇలా.. మొత్తం 25 మందిపై కేసులు కట్టారు. కేసులు నమోదు చేసిన వారిలో ఆరుగురు ప్రముఖ నటులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఐటీ చట్టం ప్రకారం ఈ కేసులు నమోదు చేసినట్టు వివరించారు.