శంకర్ దెబ్బకు లైకా ఔట్ ?

లైకా ప్రొడక్షన్స్.. సౌత్ ఇండియాలో అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి. ‘కత్తి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఆ సంస్థ కోలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మరెన్నో భారీ చిత్రాలను నిర్మించింది. కానీ ఆరంభంలో లైకా సంస్థకు బాగానే కలిసొచ్చింది. కానీ తర్వాతే వరుసగా సినిమాలు తేడా కొట్టడం మొదలైంది. పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసిన సినిమాలేవీ వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా లెజెండరీ డైరెక్టర్ శంకర్.. లైకాను కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ముందుగా ఆయన దర్శకత్వంలో లైకా వాళ్లు ఏకంగా 500 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన ‘2.0’ వర్కవుట్ కాలేదు.

2018లోనే అంత బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. ఆ సినిమా ఉన్నంతలో బాగానే ఆడినా ఓవర్ బడ్జెట్ వల్ల లైకాకు నష్టాలు తప్పలేదు. మధ్యలో వేరే సినిమాలు కూడా వరుసగా ఫెయిలయ్యాయి. ఇలాంటి టైంలో ‘ఇండియన్-2’ను మొదలుపెట్టిన లైకా.. ఈ సినిమా రిలీజయ్యే టైంకి మొత్తంగా మునిగిపోయింది. విపరీతంగా ఆలస్యం కావడం, రెండు పార్ట్‌లుగా తీయడంలో బడ్జెట్ హద్దులు దాటిపోయింది. ‘ఇండియన్-2’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కాగా.. ‘ఇండియన్-3’ అసలు విడుదలకే నోచుకునేలా లేదు. దీని కంటే ముందు వచ్చిన రజినీకాంత్ మూవీ ‘లాల్ సలామ్’, లేటెస్ట్‌ రిలీజ్ ‘విడాముయర్చి’ కూడా లైకా కొంప ముంచేశాయి. ‘విడాముయర్చి’ ఓ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి తీసిన సినిమా కావడం, నిర్మాణ సంస్థ కాపీ రైట్ కేసు వేయడంతో సెటిల్మెంట్ కోసం భారీగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఈ సినిమా ఏమో డిజాస్టర్ అయింది.

ఇంకేముంది లైకా కోలుకోలేకపోయింది. వేరే సినిమాల ప్రభావం కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా శంకర్‌తో తీసిన సినిమాలే లైకా మునిగిపోవడానికి ప్రధాన కారణం. ఇప్పుడు పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే.. తన చేతిలో ఉన్న సినిమాలను వేరే సంస్థలకు అప్పగించేసి మొత్తంగా తమ బేనర్‌ను షట్ డౌన్ చేయడానికి లైకా అధినేత సుభాస్కరన్ రెడీ అయిపోయారట. ఆయనకు విదేశాల్లో భారీ వ్యాపారాలు ఉన్నాయి. కానీ వేరే భాగస్వాములు కూడా కలిసి ఉన్న సంస్థల నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇలా వరుసగా ఫెయిల్యూర్ సినిమాలు తీసి వందల కోట్ల నష్టం మూటగట్టుకుంటే ప్రొడక్షన్ హౌస్‌ను నడపడం ఎలా సాధ్యం? అందుకే లైకాను మూసేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లైకా రిలీజ్ చేయాల్సిన ‘ఎల్-2 ఎంపురన్’ మూవీని కూడా వేరే సంస్థలకు అప్పగించేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వస్తుందో వేచి చూడాలి.