పూరి మాట.. హీరో ఎక్కడైనా చచ్చిపోతాడా?

ఏ విషయాన్నయినా బలంగా, మిగతా వాళ్లతో పోలిస్తే కొంచెం భిన్నంగా చెప్పడం పూరి జగన్నాథ్ ప్రత్యేకత. ఈ మధ్య ఆయన సినిమాల్లో పదును తగ్గి ఉండొచ్చు కానీ.. పూరి చెప్పే మాటలు మాత్రం చాలా ఎఫెక్టివ్‌గానే ఉంటున్నాయి. ఈ విషయం ఆయన పాడ్‌కాస్ట్‌లోకి వచ్చాక మరింతగా రుజువైంది.

‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో విభిన్న అంశాల మీద ఆయన చాలా ఆసక్తికర రీతిలో వాయిస్ మెసేజ్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ‘ఆత్మహత్య’ మీద మాట్లాడారు. మామూలుగా ఆత్మహత్యలు చేసుకునేవాళ్లను పిరికివాళ్లుగా, పనికి రాని వాళ్లుగా, బాధ్యత లేని వాళ్లుగా చూస్తారు. కానీ ఆ అభిప్రాయాలు పూర్తిగా తప్పంటూ పూరి తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఈ అంశంపై సూటిగా సుత్తి లేకుండా పూరి ఏమన్నాడో ఒకసారి చూద్దాం పదండి.

‘‘ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవాళ్లంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే తెలివైన వాళ్లకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఫూల్స్‌ ఎప్పుడూ ఇలా ఆలోచించరు. పిరికివాళ్లే ఆత్మహత్య చేసుకుంటారని అందరూ అంటారు. అది అబద్ధం. చనిపోవడానికి ఎంతో ధైర్యం కావాలి. ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. జీవితంలో కొన్ని సమస్యల వల్ల చనిపోవాలన్న ఆలోచన వస్తుంది. అవి ఆర్థిక సమస్యలు కావచ్చు. కుటుంబ సమస్యలు కావచ్చు. ప్రేమ అంశం కావచ్చు. బాధ్యతలు తీసుకున్న వాళ్లు మాత్రమే చనిపోవాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏ బాధ్యతలు లేకుండా బతికే వాళ్లకు ఆత్మహత్య ఆలోచనలే రావు. నిజంగా చావాల్సింది వాళ్లు. బాధ్యత తీసుకునేవాళ్లు కాదు. నీకు ప్రేమించే గుణం ఉంది. తప్పు చేయవు. ఎవరైనా మాట అంటే తట్టుకోలేవు. ఆత్మాభిమానం ఎక్కువ. నువ్వు తెలివైన వాడివి. నీకు చచ్చేంత దమ్ము ఉంది. ఇవన్నీ హీరో లక్షణాలు. హీరో చావడమేంటి. హీరో చనిపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు చనిపోకూడదు. ఏ పని చేయని, బాధ్యత లేని వాళ్లే చనిపోవాలి’’ అని పూరి తేల్చేశాడు.