రాజమౌళి కలను అమీర్ ఖాన్ తీర్చుకుంటాడా

దర్శకధీర రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన కల లాంటి ప్రాజెక్టు మహాభారతం. చాలా పెద్ద స్కేల్ మీద టాలీవుడ్ టాప్ యాక్టర్స్ ని అందులో భాగం చేసి మూడు నాలుగు భాగాలుగా రూపొందిస్తే చరిత్రలో శాశ్వతంగా ఉండిపోతుందని అభిమానులూ భావించారు. కానీ జక్కన్నకు అది సాధ్యపడలేదు. ఇప్పుడా స్వప్నాన్ని అమీర్ ఖాన్ నెరవేర్చుకునేలా ఉన్నాడు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ విశేషం పంచుకున్నాడు. మహాభారత స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని, మొదటి సంవత్సరం ప్రోగ్రెస్ ని బట్టి ఐదేళ్లలో పూర్తి చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పాడు.

క్యాస్టింగ్ తదితర వివరాలు చెప్పలేదు కానీ అమీర్ మాటలను బట్టి చూస్తే పెద్ద ప్లాన్ కనిపిస్తోంది. ఆల్రెడీ రన్బీర్ కపూర్, సాయిపల్లవితో దర్శకుడు నితీష్ తివారి రామాయణం తీస్తున్నారు. ఇంకొకరు తీయాలనే ఆలోచనే చేయనంత గొప్పగా తెరకెక్కిస్తున్నానని ఇప్పటికే ఆయన ఊరించారు. రెండు భాగాల్లో మొదటి పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి రానుంది. ఇప్పుడు మహాభారతం అమీర్ చేతికి వెళ్తోంది. గతంలో అల్లు అరవింద్, మధు మంతెన లాంటి నిర్మాతలు ఈ గాథను వందల కోట్ల బడ్జెట్ తో తీయాలనుకున్నారు కానీ సాధ్యపడలేదు. తెలుగులో దానవీరశూరకర్ణ తర్వాత దాన్ని మించిన సినిమా రాలేదు.

టైం చాలా ఉంది కాబట్టి అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్టుని ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. 2007 సూపర్ హిట్ తారే జమీన్ పర్ సీక్వెల్ సితారే జమీన్ పర్ ని వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్న ఈ విలక్షణ నటుడికి లాల్ సింగ్ చద్దా పెద్ద షాక్ ఇచ్చింది. ఆరు పదుల వయసు వచ్చినా సరే అదే ఉత్సాహంతో సినిమాలు తీస్తున్న అమీర్ ఖాన్ ఇటీవలే కొడుకుతో తెరంగేట్రం చేయించాడు కానీ ఇటు థియేటర్, అటు ఓటిటి రెండింటిలోనూ చేదు ఫలితం దక్కింది. మహారాజ్, లవ్ యాపా డిజాస్టరయ్యాయి. తర్వాతి ప్రయత్నం బలంగా ఉండేలా పవర్ ఫుల్ కాంబో కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం.