మార్చి 28 హరిహర వీరమల్లు రావడం లేదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూసిన అభిమానుల కోరిక నెరవేరింది. ఈ రోజు హోలీ మరియు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 9 మొదటి భాగం స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ థియేటర్లకు తీసుకొస్తున్నట్టు చెప్పేశారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ తో పాటు ఇతర తారాగణం గుర్రాల మీదున్న స్టిల్ ని వదిలారు. అంటే అటు ఇటుగా నలభై రోజుల వాయిదాని తీసుకుని పవర్ స్టార్ రాబోతున్నాడు. ఇదంతా ఒక కోణం. రెండోవైపు చూద్దాం.
ఇదే డేట్ కి చిరంజీవి విశ్వంభర రావాలనుకుంది. ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారనే టాక్ కూడా వినిపించింది. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరం కావడంతో పాటు థియేటర్, ఓటిటికి సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి రాకపోవడం వల్ల పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందనేది ఇన్ సైడ్ టాక్. అన్నీ అనుకూలంగా జరిగితే జూన్ లేదా జూలైలో మెగా దర్శనం జరగొచ్చు. ఇక హరిహర వీరమల్లు కోసం పవన్ కేవలం ఓ నాలుగైదు రోజులు డేట్లు ఇస్తే చాలు. మొత్తం అయిపోతుంది. దర్శకుడు జ్యోతికృష్ణ ఆయన లేని సన్నివేశాలను ఇతర ఆర్టిస్టులతో శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
బాబీ డియోల్ తాలూకు ఎపిసోడ్ ని ముంబైకి వెళ్లి మరీ షూట్ చేసుకొచ్చారు. నిర్మాత ఏఎం రత్నం విఎఫ్ఎక్స్ ఆలస్యం కాకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఒకరి మీదే అధారపడకుండా పనిని విభజించి వేర్వేరు కంపెనీలకు అప్పజెప్పడం స్పీడ్ పరంగా ఉపయోగపడుతుంది. సో పవన్ వచ్చేస్తున్నాడు కాబట్టి అదే డేట్ ని ఆప్షన్ గా పెట్టుకున్న రవితేజ మాస్ జాతర కన్ఫర్మ్ గా రానట్టే. ధనుష్ నాగార్జున కుబేర జూన్ ఎప్పుడో లాక్ చేసుకుంది కనక నో ప్రాబ్లమ్. సరే వాయిదా పడిందని రిలాక్స్ కాకుండా ప్రమోషన్స్ పరంగా పెద్ద ఎత్తున ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ మెగా సూర్య ప్రొడక్షన్స్ ని కోరుకుంటున్నారు.