పట్టువదలనంటున్న బిచ్చగాడు హీరో

వన్ మూవీ వండర్ లాగా ఎప్పుడో దశాబ్దం క్రితం బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ సాధించిన విజయ్ ఆంటోనీ పాతిక సినిమాలు పూర్తి చేసుకోబోవడం విశేషమే. తన పాతికవ మూవీ భద్రకాళి (తమిళంలో శక్తి తిరుమగన్) త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. నిన్న టీజర్ లాంచ్ చేశారు. మైత్రి సంస్థ పంపిణి బాధ్యతలు తీసుకున్న ఈ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ కొంచెం కొత్తగా, అర్థం కానట్టుగా వెరైటీగా కట్ చేశారు. ఆరు వేల కోట్ల స్కామ్ జరిగితే ప్రభుత్వం తలకిందులయ్యే పరిస్థితి తలెత్తుంది. దానికి కిట్టు అనే యువకుడు కారణమని తెలుసుకున్న పోలీసులు అతని వెంట పడతారు. అతనెవరనేది అసలు స్టోరీ.

పాయింట్ కాస్త విభిన్నంగానే అనిపిస్తోంది. విమర్శకులు మెచ్చుకున్న అరువి లాంటి సోషల్ మెసేజ్ సూపర్ హిట్ ఇచ్చిన అరుణ్ ప్రభు దీనికి దర్శకత్వం వహించాడు. విషయమున్న డైరెక్టర్ దొరికాడు కాబట్టి విజయ్ ఆంటోనీ ఈసారి సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. ఎందుకంటే తెలుగులో అతని కొత్త సినిమాలు ఎన్ని వచ్చాయో ఎన్ని పోయాయో గుర్తించే లోపే థియేటర్లలో మాయమైపోతున్నాయి. కనీసం ఓటిటిలోనూ పెద్దగా ఆదరణ దక్కడం లేదు. బిచ్చగాడు 2 ఒకటే డీసెంట్ వసూళ్లు దక్కించుకోగా మిగిలినవి చాలా మటుకు కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేకపోయాయి.

ఈ నేపథ్యంలో భద్రకాళి హిట్ కావడం విజయ్ ఆంటోనీకి చాలా కీలకం. ఈ టైటిల్ కోసం అతను వివాదం కొని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చివరికి సర్దుబాటు చేసి తెలుగులో ఆ పేరు విజయ్ ఆంటోనీకి ఇచ్చి తమిళంలో భద్రకాళిని శివ కార్తికేయన్ కు ఖరారు చేసారు. ఇది కొంత అయోమయానికి దారి తీసేదే అయినా ఇంతకన్నా పరిష్కారం దొరకలేదు. విజయ్ ఆంటోనీనే స్వయంగా సంగీతం సమకూర్చుకున్న భద్రకాళిలో మనకు పరిచయమున్న క్యాస్టింగ్ తక్కువగా ఉంది. కంటెంట్ మీద నమ్మకంతో అన్ని భాషల్లో ఒకేసారి తీసుకొస్తున్నారు. మరి ఈసారైనా బిచ్చగాడుని విజయలక్ష్మి వరిస్తుందో లేదో చూడాలి.