మార్చి నెలలో బాక్సాఫీస్ జోష్ ఇంకా రాలేదని ఎదురు చూస్తున్న తరుణంలో హోలీ పండక్కు మంచి సందడి నెలకొనబోతోంది. రేపు విడుదల కాబోతున్న కోర్ట్, దిల్ రుబాలకు ముందు రోజు సాయంత్రమే ప్రధాన కేంద్రాల్లో పోటాపోటీగా ప్రీమియర్లు వేయడం ఆసక్తి రేపుతోంది. ముందు కోర్ట్ విషయానికి వస్తే నిర్మాతగా నాని దీని మీద మాములు నమ్మకంతో లేడు. రెండు రోజుల ముందే మీడియాకు ప్రీమియర్ వేయడం ద్వారా తన కాన్ఫిడెన్స్ ని బయట పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టే ప్రీ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అయితే పబ్లిక్ చూడబోయే ఇవాళ్టి ఈవెనింగ్ షోల టాక్ ఓపెనింగ్స్ కి కీలకం కానుంది.
ఇంకోవైపు కిరణ్ అబ్బవరం దిల్ రుబా గురించి ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టమని చెప్పడం ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో పాటు మాస్ కు కావాల్సిన కమర్షియల్ అంశాలు అన్నీ పొందుపరిచినట్టు టీమ్ పదే పదే చెబుతోంది. కోర్ట్ కి కాంపిటీషన్ గా దిల్ రుబా సైతం ముందస్తు ప్రీమియర్లకు సిద్ధం కావడంతో టాక్, రివ్యూల కోసం ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అసలు తేదీ కన్నా ముందే చూసే అవకాశం కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ రెండింటికి బాగున్నాయి. ధీమా విషయంలో ఇటు నాని, అటు కిరణ్ అబ్బవరం ఇద్దరూ ఒకేలా కనిపిస్తుండటం విశేషం.
వీటితో పాటు మలయాళ హిట్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ వస్తోంది కానీ సరైన ప్రమోషన్ లేని కారణంగా ఆడియన్స్ కి పెద్దగా రిజిస్టర్ కావడం లేదు. కోర్ట్, దిల్ రుబా మధ్య ఏమేరకు తట్టుకుంటుందనేది చూడాలి. ఫిబ్రవరిలో తండేల్ తర్వాత టాలీవుడ్ కు ఊపు తెచ్చిన సినిమా రాలేదు. మజాకా లాంటివి నిరాశ పరిచాయి. ఎంటర్ ది డ్రాగన్ కొంత ఊరట కలిగించగా మిగిలినవి చేతులెత్తేశాయి. ఒకవైపు పరీక్షల సీజన్ వల్ల థియేటర్ ఆక్యుపెన్సీలు తీసికట్టుగా ఉన్నాయి. ఇప్పుడు కోర్ట్, దిల్ రుబా కనక పాజిటివ్ గా ఓపెనైతే తిరిగి జోష్ వస్తుంది. మళ్ళీ నెలాఖరు రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ వచ్చేదాకా వసూళ్లు రాబట్టుకోవచ్చు.