తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించే హీరో రాడు అని అందరూ అనుకున్నారు. కానీ గత దశాబ్ద కాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమాల బిజినెస్, వసూళ్ల పరంగా రజినీని కూడా దాటేసి పైకి వెళ్లిపోయాడు విజయ్. ఐతే కెరీర్ పీక్స్ అందుకున్న సమయంలోనే అతను సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుండడం అభిమానులకు ఒకింత నిరాశ కలిగించే విషయమే. అదే సమయంలో విజయ్ రాజకీయాల్లోకి వస్తుండడం పట్ల వారిలో ఆనందమూ వ్యక్తమవుతోంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లబోతూ చివరగా విజయ్ నటిస్తున్న చిత్రం.. జననాయగన్.
‘శతురంగ వేట్టై’ దర్శకుడు హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది దసరాకు ‘జననాయగన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిపై అంచనాలు మామూలుగా లేవు.విజయ్ కెరీర్లో చివరి చిత్రం కావడంతో దీనికి అనేక ఆకర్షణలు జోడిస్తున్నాడు దర్శకుడు. అందులో భాగంగానే ఓ పాటలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు తళుక్కుమనబోతున్నారట. ఆ ముగ్గురే.. లోకేష్ కనకరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్. లోకేష్.. విజయ్‌తో మాస్టర్, లియో లాంటి క్రేజీ సినిమాలు రూపొందించాడు. అట్లీ.. విజయ్‌కి తెరి, మెర్శల్, బిగిల్ లాంటి బ్లాక్ బస్టర్లు అందించాడు.
ఇక నెల్సన్ విజయ్‌తో తీసిన ‘బీస్ట్’ డిజాస్టర్ అయినప్పటికీ.. ఇద్దరికీ మంచి అనుబంధమే ఉంది. ఈ ముగ్గురినీ ఒక పాటలో చూపించడం అంటే అది కచ్చితంగా విశేషమే. ఇక ఈ సినిమా కథ విషయంలో అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ముందు ఇది ‘భగవంత్ కేసరి’ రీమేక్ అన్నారు. కానీ తర్వాత ప్రకటించిన టైటిల్ అదీ చూస్తే ఇది ఒరిజినల్ మూవీనే అనిపిస్తోంది. ఈ సనిమా టీజర్ వస్తే కానీ.. ఈ విషయంలో ఒక క్లారిటీ రాదేమో. ఇందులో పూజా హెగ్డే, మామిత బైజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.