గత ఏడాది దీపావళికి ‘క’ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. వరుస డిజాస్టర్లతో అల్లాడుతున్న అతడికి ఈ సినిమా గొప్ప ఉపశమనాన్ని అందించింది. కిరణ్ మీద ప్రేక్షకులకు మళ్లీ గురి కుదిరేలా చేసిన సినిమా అది. ఇప్పుడు ఈ యంగ్ హీరో కొత్త సినిమా ‘దిల్ రుబా’ విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ‘క’ కంటే ముందే సెట్స్ మీదికి వెళ్లిన సినిమా.. దిల్ రుబా. కానీ మధ్యలో ‘క’ కథ వినడం, అది తన కెరీర్‌కు గేమ్ చేంజర్ అవుతుందని కిరణ్ నమ్మడం.. ‘దిల్ రుబా’ను కాస్త హోల్డ్‌లో పెట్టి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడం.. అది రిలీజై కిరణ్ నమ్మకాన్ని నిలబెట్టడం జరిగాయి.
ఈ సక్సెస్ ఊపులో ‘దిల్ రుబా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు కిరణ్. ‘క’ వల్ల ‘దిల్ రుబా’కు బజ్ ఏర్పడింది. బిజినెస్ కూడా బాగానే జరిగింది. ‘క’ కంటే ముందు ఇది రిలీజైతే మాత్రం ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ సినిమా ప్రోమోలు చూస్తూ సూపర్ అనేలా లేవు. అదే సమయంలో తీసిపడేసే సినిమాలానూ కనిపించడం లేదు. హీరోకు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉండడం.. ఇగోకు వెళ్లి ప్రేమను ఇబ్బందుల్లో పడేసుకోవడం తరహా కథలు తెలుగులో కొత్తేమీ కాదు. ‘అర్జున్ రెడ్డి’ సహా పలు చిత్రాలు ఈ లైన్లోనే తెరకెక్కాయి. మరి ‘దిల్ రుబా’లో వాటిని మించి కొత్తగా ఏం చూపిస్తారన్నది కీలకం. ‘క’ తర్వాత కిరణ్ మీద మంచి అంచనాలతో వచ్చే ప్రేక్షకులను మెప్పించడం తేలిక కాదు.
సినిమాలో కంటెంట్ లేకుంటే.. ‘క’ సాయంతో ఈ సినిమాను సేల్ చేశాడనే ఫీలింగే వస్తుంది. కిరణ్ మీద మళ్లీ నమ్మకం సడలుతుంది. తిరిగి కెరీర్ కాస్త గాడి తప్పుతుంది. మరి కిరణ్ ‘క’ సక్సెస్ ఊపును ఎంతమేర కొనసాగిస్తాడన్నది చూడాలి. హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ తెలుగులో ఇప్పటిదాకా లీడ్ హీరోయిన్‌గా చేసిన సినిమాలేవీ సరిగా ఆడలేదు. ఆమెకు కూడా ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. ఇక కొత్తవాళ్లయిన డైరెక్టర్ విశ్వకరుణ్, నిర్మాతలు కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. మరి వీళ్లందరిని ఆశలను ‘దిల్ రుబా’ ఎంతమేర నిలబెడుతుందో చూడాలి.