నానితో చిరు… ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా?

నేచురల్ స్టార్ నాని సూపర్ ఫామ్‌లో ఉన్న హీరో మాత్రమే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా. ‘అ!’ మొదలుకుని నాని నిర్మించిన ప్రతి చిత్రంలో తన అభిరుచి కనిపిస్తుంది. తనే హీరోగా నటిస్తున్న ‘హిట్-3’తో పాటు ‘కోర్ట్’ అనే చిన్న సినిమాను కూడా అతనే ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఒకెత్తయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల రూపొందించబోయే సినిమాలో నాని నిర్మాణ భాగస్వామి కావడం మరో ఎత్తు. శ్రీకాంత్‌ను చిరు దగ్గరికి తీసుకెళ్లి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసిందే నాని. అంతే కాక చిరు తనయురాలు సుష్మితతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. చిరుకు వీరాభిమాని అయిన నాని.. ఆయన సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం గురించి ఇప్పటికే చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఈ సినిమాలో నటించడం కోసం చిరు సైతం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు.

కాగా చిరు అంతటి వాడు.. నానిని ప్రొడ్యూసర్ గారూ అని సంబోధించడం అంటే విశేషమే కదా. ఇటీవలే అదే జరిగిందట. అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ళ పెళ్లిలో ఈ విశేషం చోటు చేసుకుందట. వేదిక మీద నవ దంపతులకు శుభాకాంక్షలు చెప్పి తిరిగి వస్తుండగా.. చిరంజీవి ఎదురు పడ్డాడని, అప్పుడాయన ‘‘ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా’’ అని అడిగాడని నాని గుర్తు చేసుకున్నాడు. చిరుతో తనతో మాట్లాడుతున్నాడని తాను అనుకోలేదని.. అశ్వినీదత్ లాంటి పెద్ద వాళ్లెవరైనా తన వెనుక ఉన్నారేమో అనుకుని వెనుదిరిగి చూశానని.. కానీ అక్కడ ఎవరూ లేరని నాని తెలిపాడు.

చిరు వెంటనే.. ‘‘మిమ్మల్నే ప్రొడ్యూసర్ గారూ’’ అంటూ దగ్గరికి వచ్చి తనను కౌగిలించుకున్నట్లు నాని తెలిపాడు. చిరు తననిలా సంబోధించడం చాలా ఆశ్చర్యంగా అనిపించిందని నాని అన్నాడు. ‘కోర్ట్’ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శితో కలిసి పాల్గొన్న సందర్భంగా నాని ఈ విషయం వెల్లడించాడు. ఇక ‘కోర్ట్’ సినిమాను నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడని తెలిసి, అది కచ్చితంగా హిట్ అవుతుందని చిరు తనతో అన్నట్లు ఈ సందర్భంగా ప్రియదర్శి వెల్లడించాడు.