నిన్న యానిమల్ మీద విమర్శ…ఇప్పుడు మన హీరోలపై అక్కసు

సుప్రసిద్ధ రచయిత జావేద్ అక్తర్ గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ షోలే లాంటివి ఎన్నో ఇచ్చిన రైటర్ గా ఆయనకున్న గుర్తింపు అసమానం. కానీ ఈ మధ్య కాలంలో పెద్దాయనకు సౌత్ సినిమాల మీద అక్కసు మొదలయ్యింది. మొన్న ఏడాది యానిమల్ వచ్చినప్పుడు ఇది ఏకంగా సమాజాన్ని చెడగొడుతుందనే రేంజ్ లో వాపోయారు. వారబ్బాయి ఫర్హాన్ అక్తర్ మీర్జాపూర్ లాంటి హింసాత్మక బూతు వెబ్ సిరీస్ తీస్తే మాట్లాడరు. ముంబై డబ్బావాల వ్యాపారాన్ని డ్రగ్స్ తో ముడిపెట్టి అనుమానించేలా తీసిన డబ్బా కార్టెల్ లో భార్య షబానా అజ్మీ నటిస్తే నోరెత్తరు. కానీ దాక్షిణాది మీదే కన్ను పెడతారు.

తాజాగా అమీర్ ఖాన్ తో చేసిన ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ మాట్లాడుతూ సౌత్ లో ముక్కు మొహం తెలియని హీరోల సినిమాలు ఇక్కడ ఏడెనిమిది వందల కోట్లు వసూలు చేస్తున్నాయని, మనవి ఆదరణ పొందలేకపోయాయని తెగ బాధ పడ్డారు. దానికి అమీర్ ఇచ్చిన సమాధానం ఎంత హుందాగా ఉందనేది పక్కనపెడితే అక్తర్ సాబ్ పరోక్షంగా అన్నది పుష్ప గురించేనని వేరే చెప్పనక్కర్లేదు. ఇదొక్కటే ఆ స్థాయిలో విజయం సాధించింది. ఆల్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడం బహుశా జీర్ణించుకోలేకపోయారేమో. అందుకే ఈ రూపంలో తన ఆక్రోశాన్ని బయట పెట్టుకున్నారు.

అయినా సల్మాన్ షారుఖ్ లు ఎంత పెద్ద స్టార్లైనా తెలుగు తమిళ రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలుసన్న గ్యారెంటీ లేదు. ఆ మాటకొస్తే వీళ్ళ సినిమాలు ఏపీ తెలంగాణలో కొన్ని ప్రాంతాలు మినహాయించి పెద్దగా ఆడటం లేదు. ఒకప్పటి మార్కెట్ హిందీ సినిమాలకు ఇక్కడ లేదు. కానీ అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే వార్ 2 కోసం ఏరికోరి తారక్ ని తీసుకుంది యష్ రాజ్ ఫిలింస్. ప్రభాస్ ని మూడు ప్రాజెక్టులకు లాక్ చేసుకుంది టి సిరీస్ సంస్థ. ఇవన్నీ మర్చిపోయి జావేద్ అక్తర్ చేస్తున్న కామెంట్స్ లో దుగ్ద తప్ప ఇంకేమి కనిపించడం లేదన్నది వాస్తవం.