నేను దయ్యాన్ని కాదు-నిధి అగర్వాల్

హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ వేసేవారు కానీ.. ‘చంద్రముఖి’ తర్వాత పరిస్థితి మారిపోయింది. అందులో జ్యోతిక దయ్యం పాత్రలో అద్భుత అభినయంతో ప్రశంసలు అందుకోవడంతో మంచి పెర్ఫామెన్స్ ఇవ్వడానికి ఈ పాత్రలు మంచి ఛాయిస్ అని హీరోయిన్లు భావించి వీటికి ఓకే చెప్పడం కామన్ అయింది. నయనతార, తమన్నా సహా ఎంతోమంది స్టార్ హీరోయిన్లు దయ్యాల పాత్రలు పోషించారు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’లో ప్రభాస్ సైతం దయ్యంగా కనిపించనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం దయ్యం క్యారెక్టర్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.కానీ ఆ ప్రచారాన్ని నిధి ఖండించింది. తాను ‘రాజా సాబ్’లో చేస్తున్నది దయ్యం క్యారెక్టర్ కాదని ఆమె స్పష్టం చేసింది. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో తన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందని ఆమె చెప్పింది. అదే సమయంలో అది రెగ్యులర్ గ్లామర్ క్యారెక్టర్ కాదని చెప్పిన నిధి.. ఇందులో పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంటుందని నిధి తెలిపింది.

ఇక తాను నటిస్తున్న మరో భారీ చిత్రం హరిహర వీరమల్లు గురించి నిధి మాట్లాడుతూ.. ‘‘ఇదొక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. పవన్‌ కళ్యాణ్ గారితో నటించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. ఆయన ఒక మేధావి. సాహిత్యం మీద ఎంతో పట్టు ఉంది. పవన్ గారు డిప్యూటీ సీఎం కాకముందే ఆయనతో షూటింగ్ చేశాను. ఎన్నికల సమయంలో బిజీగా ఉండడంతో షూటింగ్ ఆగింది. డిప్యూటీ సీఎం అయ్యాక మళ్లీ చిత్రీకరణలో పాల్గొన్నారు. కానీ అప్పటికి, ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ అలాగే ఉన్నారు’’ అని నిధి పేర్కొంది.