నిన్న ఇండియా న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతున్నా సరే దానికి ధీటుగా ట్రెండింగ్ లోకి వచ్చిన టాపిక్ ఎస్ఎస్ఎంబి 29 వీడియో లీక్. మహేష్, పృథ్విరాజ్ మీద షూట్ చేసినట్టుగా చెప్పబడుతున్న ఒక చిన్న క్లిప్ బయటికి రావడంతో ఒక్కసారిగా ఎక్స్, ఇన్స్ టా ఊగిపోయాయి. ఇది నిజంగా రాజమౌళి సినిమానా లేకా ఏదైనా యాడా అని సందేహ పడిన వాళ్ళు లేకపోలేదు. కానీ చుట్టూ ఉన్న వాతావరణం, కనిపిస్తున్న ఆర్టిస్టులు అన్నీ జక్కన్న ప్యాన్ వరల్డ్ మూవీనే సూచిస్తున్నాయి. కొన్ని అకౌంట్లు వీడియోని డిలీట్ చేయగా మరికొన్ని మాధ్యమాల్లో ఇంకా తిరుగుతూనే ఉంది.
ఇలాంటి లీకులు రాజమౌళి సినిమాలకు కొత్త కాదు. గతంలో ఆర్ఆర్ఆర్ విడుదలకు చాలా ముందే జూనియర్ ఎన్టీఆర్ అడవిలో పులిని తప్పించుకుని పరిగెత్తే వీడియో బాగానే చక్కర్లు కొట్టింది. బాహుబలి 2 తాలూకు ఫుటేజ్ కొంత భాగం ఎడిటింగ్ కాక ముందు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యింది. ఆ టైంలో చర్యలు తీసుకుని వాటిని కట్టడి చేశారు కానీ మహేష్ బాబు విషయంలో జరిగింది మరీ చాలా అంటే చాలా త్వరగా. ఇంకా పది శాతం చిత్రీకరణ కూడా జరగలేదు. శుభామాని మొదలుపెట్టి పది రోజులు కాక ముందే ఇలాంటి లీకులు ఫ్యాన్స్ లో ఎక్క్కడ లేని ఆందోళన కలిగిస్తున్నాయి. హెచ్చరిక ఇస్తున్నాయి.
నిజానికి వీటి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు కానీ కట్టడి చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. ఒకప్పుడు నిర్మాతలు మీడియాని షూటింగ్ స్పాట్ కి పిలిచి అప్డేట్స్, ఫోటోలు ఇచ్చేవాళ్ళు. కానీ సాంకేతికత పెరిగిపోయాక అలా చేయలేకపోతున్నారు. కారణం దుర్వినియోగం కావడానికి ఎక్కువ అవకాశం ఉండటమే. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల సహాయంతో దొంగచాటుగా తీస్తున్న దొంగలను పట్టుకోవడం నిర్మాతలకు సవాల్ గా మారింది. అయినా చాలా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇదంతా ఎలా జరిగిందనేది రాజమౌళి బృందానికి పెద్ద పజిల్ గా మారిందట.