తెలుగు హీరోలకే సందు లేదంటే..


ఒకప్పట్లా తెలుగు బాక్సాఫీస్‌లో తమిళ హీరోల హవా నడవట్లేదు కొన్నేళ్లుగా. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి హీరోనే ఇక్కడ ప్రాభవం కోల్పోయాడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు వచ్చిన డే-1 షేర్ కూడా ఈ మధ్య ఆయన చిత్రాల ఫుల్ రన్‌లోనూ రాని పరిస్థితి. మిగతా తమిళ స్టార్ల ప్రభావం కూడా అంతంతమాత్రంగానే ఉంది. గతంలో తెలుగు స్టార్లతో సమానంగా క్రేజ్ ఉన్న సూర్యకు కూడా ఇప్పుడిక్కడ బండి నడవట్లేదు.

ఇలాంటి సమయంలో కోలీవుడ్ కాంట్రవర్శల్ హీరో శింబు తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుండటం విశేషం. ‘ఈశ్వరన్’ పేరుతో తెరకెక్కతున్న అతడి కొత్త సినిమాను ‘ఈశ్వరుడు’ పేరుతో తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను తమిళంతో పాటే తెలుగులోనూ రిలీజ్ చేశారు. చెరకు తోట మధ్యలో లుంగీ, గళ్ల చొక్కా వేసుకుని పక్కా పల్లెటూరి వాడిలా తయారై ఉన్న శింబు మెడలో పాముతో కనిపిస్తున్నాడు. దీంతో టైటిల్ జస్టిఫికేషన్ కూడా ఇచ్చినట్లయింది.

ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నా పేరు శివ, పల్నాడు లాంటి సినిమాలతో సుశీంద్రన్ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. మరో విశేషం ఏంటంటే.. ‘ఇస్మార్ట్ శంకర్’ భామ నిధి అగర్వాల్ ఇందులో కథానాయిక. వరుస మ్యూజికల్ హిట్లతో ఊపుమీదున్న తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇలా అందరూ తెలుగు ప్రేక్షకులతో టచ్ ఉన్న వాళ్లే కావడంతో ఈ సినిమాను తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ అంతా బాగున్నా సరే.. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకోవడంతోనే వస్తోంది సమస్య.

తెలుగులోనే సంక్రాంతికి గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అరణ్య, రంగ్ దె, రెడ్, క్రాక్.. సంక్రాంతిని టార్గెట్ చేశాయి. అసలు థియేటర్లు ముందులా నడిస్తే తెలుగు సినిమాలకే సర్దుబాటు కష్టం. గత రెండేళ్లు రజినీ సినిమాకే సంక్రాంతి టైంలో థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమైంది. అలాంటిది తెలుగులో ఏమాత్రం మార్కెట్ లేని శింబు వచ్చి వచ్చే సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేస్తానంటే ఎలా వర్కవుటవుతుంది?