అప్పుడు అంత హైప్.. కానీ ఇప్పుడేమో

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్.. తొలిసారి ఈ వార్త బయటికి వచ్చినపుడు పవన్ అభిమానులు మాత్రమే కాదు, సగటు తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. పవన్ లాంటి టాప్ స్టార్‌తో క్రిష్ లాంటి విలక్షణ దర్శకుడు సినిమా చేయడం ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ టీజర్ రిలీజైనపుడు.. ఇది కదా కావాల్సింది అనుకున్నారు పవన్ ఫ్యాన్స్.

ఒక స్టార్‌గా తనలో ఎంతో పొటెన్షియాలిటీ ఉన్నప్పటికీ.. అందుకు తగ్గ సినిమాలు చేయట్లేదన్నది పవన్ అభిమానుల కంప్లైంట్. రీఎంట్రీ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో.. ఇలా వరుసగా రీమేక్ సినిమాలు చేయడం ఫ్యాన్స్‌కు ఒకింత నిరాశనే కలిగించింది. అయినా సరే.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఒక రేంజ్ హైప్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘వీరమల్లు’ టీజర్ చూశాక దీని బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ వేరే లెవెల్లో ఉంటుందని అనుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేయగలదని అంచనా వేశారు. మేకింగ్ కొంచెం ఆలస్యం అవుతున్నా సరే.. అభిమానులు ఓపిగ్గా ఎదురు చూశారు.

కానీ ఎప్పడైతే ఈ సినిమా నిరవధికంగా వాయిదా పడి, క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడో అప్పట్నుంచి కథ మారిపోయింది. అంతకుముందున్న హైప్ నెమ్మదిగా కరిగిపోతూ వచ్చింది. ఎంత క్రేజీ ప్రాజెక్ట్ అయినా మేకింగ్ దశలోనే నాలుగైదేళ్లు ఉంటే హైప్ కంటిన్యూ కావడం కష్టం. పైగా క్రిష్ లాంటి గొప్ప అభిరుచి ఉన్న దర్శకుడు ఈ చిత్రం నుంచి తప్పకుని.. డిజాస్టర్ డైరెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన జ్యోతికృష్ణ ఈ సినిమాను టేకప్ చేశాడో అప్పుడే పవన్ ఫ్యాన్స్ దీని మీద అంచనాలు తగ్గించేసుకున్నారు. జ్యోతికృష్ణ నుంచి చివరగా వచ్చిన ‘రూల్స్ రంజన్’ చూసిన వాళ్లు ‘వీరమల్లు’ లాంటి భారీ చిత్రాన్ని అతడి చేతికి అప్పగించారంటే ఇంకేం ఆశలు పెట్టుకోగలరు?

అతను తీస్తున్నది తక్కువ పార్ట్ అయినా సరే.. అది ప్రాజెక్టు మీద ప్రతికూల ప్రభావం చూపేదే. పెండింగ్ షూట్ చకకకా లాగించేసి త్వరగా రిలీజ్ చేసి ఉన్నా పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండేది. కానీ మార్చి 28కి రిలీజ్ డేట్ ఇచ్చి మళ్లీ యధావిధిగా సినిమాను వాయిదా వేయడం.. అసలెప్పుడు సినిమా పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని అయోమయ స్థితిలోకి ‘వీరమల్లు’ వెళ్లిపోవడంతో అభిమానులు పూర్తిగా దీనిపై ఆశలు వదులుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ టైంకి అసలు హైపే లేకుంటే ఆశ్చర్యమేమీ లేదు. అసలు పవన్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా ఇప్పుడు ఇలాంటి స్థితికి చేరడానికి పవన్ సహా టీంలో అందరూ కారణమే.