పుష్ప 2 ది రూల్ రిలీజై మూడు నెలలు దాటిపోయాక అల్లు అర్జున్ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందాని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ఆలస్యమయ్యేలా ఉండటంతో అట్లీది ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా లీకుల రూపంలో దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కథను ముందు సల్మాన్ ఖాన్ కి వినిపించి, మల్టీస్టారర్ గా ప్లాన్ చేసుకుని, ఆ తర్వాత బడ్జెట్ సమస్యల వల్ల బన్నీ దగ్గరకు తెచ్చారనే టాక్ ముందు నుంచి ఉంది. కండల వీరుడి మీద మీద వర్కౌట్ కానీ ఖర్చు ఐకాన్ స్టార్ అయితే వెనక్కొస్తుందని నిర్మాతల నమ్మకం.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో స్టార్ అవసరమైన నేపథ్యంలో శివ కార్తికేయన్ కోసం దర్శకుడు అట్లీ ప్రయత్నిస్తున్నట్టు కోలీవుడ్ గాసిప్. అల్లు అర్జున్ కలయికలో అమరన్ హీరో అంటే తెలుగు, తమిళ మార్కెట్లలో బిజినెస్ పరంగా భారీ క్రేజ్ నెలకొంటుంది. అట్లీ రాసుకున్న స్టోరీ ప్రకారం ఇద్దరి హీరోల మధ్య టెర్రిఫిక్ ఎపిసోడ్స్ ఉన్నాయట. వాటిని ఇమేజ్ ఉన్న వాళ్లయితేనే న్యాయం చేస్తారని భావించి అట్లీ అలాంటి కాంబో కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. సల్మాన్ ఖాన్ కు నెరేషన్ ఇచ్చినప్పుడు కూడా రజనీకాంత్ లేదా కమల్ హాసన్ ను మనసులో పెట్టుకునే ప్లాన్ చేసుకున్నారట.
ఇది తేలితే కానీ ప్రకటన రాకపోవచ్చు. మొత్తానికి అల్లు అర్జున్ తో ఓకే చేయించుకున్న కథలో అట్లీ ఇద్దరు హీరోలను పెట్టబోతున్న క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఆర్ఆర్ఆర్ స్థాయిలో ఉంటుందా లేక ఎవడు తరహాలో వేర్వేరుగా చూపిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. జాన్వీ కపూర్ తో పాటు మరో నలుగురు హీరోయిన్లను తీసుకునే ప్రతిపాదన ఉన్నట్టు వినికిడి. జవాన్ తర్వాత ఏడాదికి పైగానే బ్రేక్ తీసుకన్న అట్లీ బేబీ జాన్ రచన, నిర్మాణంలో కొంత కాలం గడిపాడు. అదేమో దారుణంగా డిజాస్టరయ్యింది. అందుకే ఇప్పుడు పూర్తి ఫోకస్ బన్నీ ప్రాజెక్టు మీదే పెట్టి ప్యాన్ ఇండియాని మించి ప్లాన్ చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్.