సంక్రాంతి 2026 – పందెం కోళ్ల జాబితా

టాలీవుడ్ బంగారు బాతులా భావించే సీజన్ సంక్రాంతి. యావరేజ్ లేదా అంతకు మించి కొంచెం బెటర్ అనిపించుకున్న ఏ సినిమా అయినా హిట్టు కొట్టడం ఖాయం. ఇక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఏకంగా రికార్డులు బద్దలవుతాయి. నిర్మాతలు వీలైనంత వరకు ఈ పండగని మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు. హీరోలు కూడా అంతే పట్టుదలతో సహకరిస్తారు. అందుకే 2026 జనవరి మీద అప్పుడే కర్చీఫుల పర్వం మొదలైపోయింది. ప్రొడ్యూసర్లు ఎంత ముందు చూపుతో తొమ్మిది నెలల ముందే ప్లానింగ్ తో ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ముందైతే అసలు ఎవరెవరు రేసులో ఉన్నారో చూస్తే పోటీ పట్ల అవగాహన వస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందే డ్రాగన్ అందరి కంటే ముందు రావడానికి ప్లాన్ చేసుకుంటోంది. టెంటేటివ్ గా జనవరి 10 అనుకుంటున్నారు కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హీరో ఇంకా సెట్స్ లో అడుగుపెట్టకపోయినా ప్లాన్ ప్రకారం నవంబర్ కల్లా పూర్తి చేసే కాన్ఫిడెన్స్ తో నీల్ ఉన్నాడు. చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికకు ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తరహాలో దీన్ని కూడా నాలుగైదు నెలల్లో పూర్తి చేసే లక్ష్యంలో మార్పు ఉండకపోవచ్చు. నవీన్ పోలిశెట్టి – మీనాక్షి చౌదరిల అనగనగా ఒక రాజుని సంక్రాంతికే ప్లాన్ చేస్తోంది సితార సంస్థ.

ఇవి కాకుండా రవితేజ – కిషోర్ తిరుమల, వెంకటేష్ – సురేందర్ రెడ్డి కాంబోలో ప్రాజెక్టులు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ఒకవేళ ఓకే అయితే మాత్రం ఎక్కువ ఆలస్యం లేకుండా వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లి డిసెంబర్ కల్లా ఫస్ట్ కాపీలు సిద్ధం చేసేలా దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఎవరు ఉంటారు ఎవరు తప్పుకుంటారనేది పూర్తిగా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతే. ఒకరు వస్తారని మరొకరు రావడం, ఖచ్చితంగా వస్తామని చెప్పిన వాళ్ళు మాట మార్చుకోవడం ఎప్పుడూ జరిగేదే. సో ఈ పందెం కోళ్లలో ఎవరు ఫిక్స్ ఎవరు డ్రాపనేది కాలమే నిర్ణయించాలి.