ఏజెంట్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకుని లెనిన్ చేస్తున్న అఖిల్ త్వరలోనే పూరి జగన్నాథ్ తో ఒక సినిమాలో నటించే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో తిరుగుతున్న పుకార్లు ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఏడాదిన్నర టైం తీసుకున్న అఖిల్ ప్రస్తుతం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేడని సన్నిహిత వర్గాల సమాచారం. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న లెనిన్ ఈ ఏడాది మొత్తం షూటింగ్ లోనే ఉంటుంది. 2026 విడుదల ఉండొచ్చని టాక్. అదే నిజమైన పక్షంలో తన తర్వాతి సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలవొచ్చు.
దీని తర్వాత అఖిల్ చేతిలో ఉన్న ప్రాజెక్టు యువి క్రియేషన్స్ ది. ఎప్పటి నుంచో ఈ సంస్థలో పని చేస్తున్న అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్యాన్ ఇండియా మూవీకి మొత్తం సిద్ధం చేసి ఉంచారు. అయితే విశ్వంభరకు జరిగిన ఆలస్యం వల్ల దీన్ని వెంటనే పట్టాలు ఎక్కించలేకపోయారు. పైగా యువికొచ్చిన ఫ్లాపులు బడ్జెట్ మీద ప్రభావం చూపించాయి. అనుష్క ఘాటీని సెట్స్ పైకి తీసుకెళ్లడంతో అఖిల్ ప్రాధాన్యత లెనిన్ వైపు వెళ్ళిపోయింది. అన్నీ సానుకూలంగా జరిగితే అఖిల్ – అనిల్ కాంబో కొంత లేట్ అయినా తెరకెక్కడం దాదాపు ఖాయం. అధికార ప్రకటనకు కొంచెం టైం పడుతుంది.
మరి పూరి జగన్నాథ్ తో కలయిక అన్నది అంత సులభంగా జరిగేలా లేదు. ఇంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్న అఖిల్ ట్రాక్ రికార్డు దెబ్బ తిన్న దర్శకుడితో చేతులు కలుపుతారా అంటే అనుమానమే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. లైగర్, డబల్ ఇస్మార్ట్ రెండూ దారుణంగా పోవడం పూరి మార్కెట్ ని దెబ్బ కొట్టింది. అందుకే ఈసారి తొందరపడకుండా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. స్టార్ హీరోలు దొరక్కపోతే కొత్త వాళ్ళతో లేదా ఇమేజ్ లేని క్యాస్టింగ్ తో తీసయినా హిట్టు కొట్టే కసితో ఉన్నాడని ఫ్రెండ్స్ అంటున్నారు. లేదూ అఖిల్ తోనే జట్టు కుదిరితే పూరికి అంతకన్నా లక్కీ ఛాన్స్ ఇంకేముంటుంది.