గత కొన్ని నెలలుగా పరిశ్రమను తీవ్రంగా పట్టి పీడిస్తున్న హెచ్డి పైరసీ కట్టడికి ఏ చర్యలు తీసుకున్నా ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. రిలీజ్ రోజు గడవకుండానే మంచి క్వాలిటీతో ప్రింట్లు ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడం చాలా సీరియస్ మ్యాటర్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు దీని గురించి ఆలోచించాల్సిన విషయాలు పంచుకున్నారు. ప్రతి శుక్రవారం ఎవరి నొప్పి వాళ్ళదనే తరహాలో మిగిలిన వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే పైరసీని కంట్రోల్ చేయలేకపోతున్నామని, ముఖ్యంగా సహకారం కొరవడిందని అన్నారు.
అందరూ కలిసికట్టుగా ఒక ఉద్యమంలా నడుం బిగిస్తే తప్ప ఇలాంటి సమస్యలు పరిష్కరించుకోలేమని, ఎవరి దారి వాళ్ళు చూసుకుని సోమవారం రాగానే కొత్త షూటింగుల్లో బిజీ అయితే, చేయగలిగింది ఏముందంటూ కుండ బద్దలు కొట్టేశారు. ఇది ముమ్మాటికీ వాస్తవం. గేమ్ ఛేంజర్ నుంచి తండేల్ దాక జరిగింది ఇదే. మూడు నాలుగు రోజులు హడావిడి చేయడం తప్ప పైరసీ చేసిన వాళ్ళను పట్టుకోవడం కానీ, లేదా దాని మూలలను వెతికేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కానీ మచ్చుకు కూడా కనిపించలేదు. డౌన్లోడ్ చేసుకున్నా కేసులు పెడతామని చెప్పడమే తప్ప అసలు ప్రింట్ బయటికి తెచ్చోనోళ్లనే పట్టుకోలేదు.
దిల్ రాజు చెప్పినట్టు పక్కడి ప్రాబ్లమ్ నాది కాదు అనుకున్నన్ని రోజులు పైరసీ లాంటి భూతాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఏకంగా హెచ్డి రూపాన్ని సంతరించుకున్నాయి. నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల నిర్మాతలు కంకణం కట్టుకోవాలి. ఇవాళ దీన్ని మూకుమ్మడిగా అణిచేస్తే భవిష్యత్తు బాగుంటుందనే వాస్తవాన్ని గుర్తించాలి. లేదంటే మార్నింగ్ షోకే ఆన్ లైన్ పైరసీ పెట్రేగిపోవడం ఖాయం. అప్పుడు ఓటిటి ధరల మీద ప్రభావం పడి చివరికి నష్టపోయేది నిర్మాతే. ఇది గుర్తిస్తే తప్ప ఎలాంటి సొల్యూషన్ రాదు. మరి దిల్ రాజు చెప్పిన ప్రకారం అందరూ అంత తీవ్రంగా అలోచించి చేతులు కలుపుతారా. చూద్దాం.