అల్లు అర్జున్… స్పెష‌ల్ ట్రైనింగ్ దేనికో?

పుష్ప‌-2 సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానుల‌ సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు గ‌త డిసెంబ‌రులో తెర‌ప‌డింది. బ‌న్నీ క‌ష్టానికి ఆ సినిమా గొప్ప ఫ‌లితాన్నే అందించింది. ఆ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసిన ద‌గ్గ‌ర్నుంచి బ‌న్నీ కొత్త సినిమా క‌బురు కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆచితూచి సినిమాలు చేసే అల్లు హీరో కొత్త సినిమాను ఎంత‌కీ ప్ర‌క‌టించ‌డం లేదు. ఎప్పుడో ఓకే అయిందుకున్న త్రివిక్ర‌మ్ సినిమా ఎందుకో ముందుకు క‌ద‌ల‌డం లేదు. ఈలోపు త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీతో సినిమా తెర‌పైకి వ‌చ్చింది. కానీ అది కూడా వెంట‌నే ప‌ట్టాలెక్క‌డం సందేహంగానే క‌నిపిస్తోంది. బ‌న్నీ ఏమో అస‌లు ఎవ‌రికీ అందుబాటులో లేకుండా ఏదో ఫారిన్ టూర్ వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

తాజా క‌బురేంటంటే.. సోమ‌వార‌మే బ‌న్నీ సిటీలోకి అడుగు పెట్టాడ‌ట‌. మ‌రి కొత్త సినిమా గురించి అప్‌డేట్ ఏంటి అని బ‌న్నీ స‌న్నిహితుడైన బ‌న్నీ వాసును చావా తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించిన ప్రెస్ మీట్లో విలేక‌రులు అడిగితే స్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇవ్వ‌లేక‌పోయాడు. బ‌న్నీ ఒక స్పెష‌ల్ ట్రైనింగ్ కోసం వేరే దేశానికి వెళ్లిన‌ట్లు బ‌న్నీ వాసు వెల్ల‌డించ‌డం విశేషం. ఇది ప‌ర్స‌న‌ల్ ట్రైనింగ్ అని చెప్పాడు వాసు. బ‌న్నీ న‌ట‌న‌కు సంబంధించి ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూనే ఉంటాడ‌ని.. కొత్త కొత్త ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తుంటాడ‌ని.. ఇందులో భాగంగానే ట్రైనింగ్ కోసం ఫారిన్ వెళ్లాడ‌ని వాసు తెలిపాడు. మ‌రి ఈ స్పెష‌ల్ ట్రైనింగ్ మ‌త‌ల‌బు ఏంటో.. అది ఏదైనా ప‌ర్టికుల‌ర్ సినిమా కోసం తీసుకున్నాడా, లేక జ‌న‌ర‌ల్ ట్రైనింగా అన్న‌ది బ‌న్నీ స‌న్నిహితులే చెప్పాలి.

ఇక బ‌న్నీ కొత్త సినిమా క‌బురు గురించి వాసు మాట్లాడుతూ.. దాని గురించి బ‌న్నీ టీమే త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని చెప్పాడు. తాను కూడా బ‌న్నీని ఇంకా క‌ల‌వ‌లేద‌ని.. త్వ‌ర‌లో క‌లుస్తాన‌ని తెలిపాడు. త్రివిక్ర‌మ్, అట్లీ చిత్రాల్లో ఏది ముందు ఉంటుంద‌నే విష‌యంలో వాసు ఏమీ క్లారిటీ ఇవ్వ‌లేదు. పుష్ప‌-2 రిలీజ్ టైంలో పెద్ద ర‌భ‌స జ‌రిగిన నేప‌థ్యంలో బ‌న్నీ ఇక‌పై త‌న సినిమాల గురించి మీడియాకు స‌మాచారం ఇవ్వ‌డానికి స్పెష‌ల్ టీంను పెట్టుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో బ‌న్నీ వాసు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.