భారతీయ చలన చిత్రాల్లో హీరోల పాత్రల తీరుపై బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మృతి చెందిన తెలుగు అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడిన వెంకయ్య… ప్రస్తుతం వస్తున్న సినిమాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరోల పాత్రల తీరుపై దర్శకులు తమ పద్ధతి మార్చుకోవాలని కూడా వెంకయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో సినిమాల ద్వారా ప్రజలకు మంచి సందేశం వెళ్లేదని వెంకయ్య అన్నారు. ఇప్పుడు సినిమాల్లో దేశ ద్రోహులు, స్మగ్లర్లు, సమాజంలో తప్పుడు విధానాలు పాటించే వారితో హీరో పాత్రలకు రూపకల్పన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరహా చర్యల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళుతుందన్న విషయంపై దర్శకులు ఓసారి ఆలోచన చేయాలని ఆయన అన్నారు. చెడు పనులను ఎప్పుడూ గొప్పగా చూపించకూదని కూడా వెంకయ్య అభిప్రాయపడ్డారు.
సినిమా రంగం ఎప్పుడూ బాధ్యతాయుతమైన మాధ్యమంగా ఉండాలని వెంకయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. చెడు పాత్రల ద్వారా సమాజంలో చెడు భావనలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హీరోల పాత్రల ప్రభావం చిన్న పిల్లలపై అధికంగా పడుతుందని, సున్నితమైన ఈ విషయాలపై సినీ పరిశ్రమలో ఓ విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా వెంకయ్య అబిప్రాపడ్డారు. ఇదిలా ఉంటే… ఇటీవలే నంద్యాలలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates