ది ప్యారడైజ్ : ఒక ల*** కొడుకు కథ!

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే విపరీతమైన అంచనాలు నెలకొన్న సినిమాగా ‘ది ప్యారడైజ్’ చాలా ప్రత్యేకత సంతరించుకుంది. దసరా రూపంలో వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈసారి అంతకు మించిన వయొలెన్స్, ఎలివేషన్లతో ఈ ప్యాన్ ఇండియా మూవీ తీస్తానని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. అందుకే అనౌన్స్ మెంట్ టీజర్ మీద అందరి కళ్ళు పడ్డాయి. ఇవాళ ఆ లాంఛనం జరిగిపోయింది. తాను చూపించబోయే కొత్త ప్రపంచం ఎంత హింసాత్మకంగా ఉంటుందో చిన్న శాంపిల్ లాగా శ్రీకాంత్ ఓదెల వంద సెకండ్ల నిడివిలో పరిచయం చేశాడు.

కథేంటో చెప్పకపోయినా కాన్సెప్ట్ రివీల్ చేశారు. పక్షుల్లో నిర్లక్ష్యానికి గురైన కాకులను ప్రపంచం ఎప్పుడూ చులకనగా చూస్తుంది. వాటి గురించి ఎవరూ రాయరు. అలా అణిచివేతకు గురైన ఒక జాతిని మేలుకొలిపేందుకు తల్వార్ పట్టిన నాయకుడు (నాని) ఒకడు వస్తాడు. అయితే అతని పుట్టుకే అవమానకరంగా జరిగి ఉంటుంది. జనం ఛీ కొట్టే వేశ్య బిడ్డగా ఆ ఊరిలో అడుగు పెడతాడు. రెండు పొడవాటి జడలతో పై భాగంపై ఆచ్చాదన లేకుండా చేతిలో మారణాయుధాలు పట్టుకుని సమూహాన్ని నడిపిస్తాడు. రక్తంతో నిండిన నరకాన్ని ప్యారడైజ్ అని ఎందుకు అన్నారో చూడాలంటే ఇంకో ఏడాది ఆగాల్సిందే.

విజువల్స్ నిజంగానే మాట రాకుండా చేశాయి. ఒక డార్క్ వరల్డ్ లోకి తీసుకెళ్లి శవాల గుట్టల మధ్య నానిని వెనుకనుంచి చూపించి ఇప్పటిదాకా ఏ హీరో వేయని గెటప్ లో చూపించిన విధానం కొన్ని రోజుల పాటు వెంటాడేలా ఉంది. ఇలాంటి నేపథ్యం ఇప్పటిదాకా రాలేదని కాదు కానీ ఇంత ఇంటెన్స్ పండించడం అరుదు. అనిరుధ్ రవిచందర్ బిజిఎం, జికె విష్ణు ఛాయాగ్రహణం, ఏదో వేరే గ్రహంలో ఉన్నట్టు అనిపించే ఆర్ట్ వర్క్ అబ్బురపరిచేలా ఉన్నాయి. 2026 మార్చ్ 26 విడుదల తేదీని ఖరారు చేసుకున్న ది ప్యారడైజ్ దసరాకు పదింతల ఎలివేషన్ కంటెంట్ తో వస్తోందన్న నమ్మకం కలిగించేసింది.