మెగా బ్రదర్స్ ఇద్దరికీ ఒకే సమస్య

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు ఒకే సమస్య వచ్చి పడింది. విశ్వంభర విడుదల తేదీ నిర్ణయించాలంటే విఎఫ్ఎక్స్ పనులు కొలిక్కి రావాలి. టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో పెట్టుకుని ఈసారి తొందరపడకుండా క్వాలిటీ మీద దృష్టి పెట్టి రీ వర్క్ చేస్తున్నారు. దీంతో సంక్రాంతి నుంచి మేకి షిఫ్ట్ అయితే ఇప్పుడు జూన్ కూడా చేయి దాటి పోయేలా ఉందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. భోళా శంకర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ వచ్చేసిందని చిరు అభిమానులు ఫీలవుతున్నారు. దర్శకుడు వశిష్ట బ్యాలన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ ఉండటంతో సరైన అప్డేట్స్ ఇవ్వలేకపొతున్నాడు. ఇది సులభంగా తేలే వ్వవహారం కాదు.

ఇక హరిహర వీరమల్లు మూడేళ్లకు పైగా పురిటి కష్టాలు పడుతూనే ఉంది. ఏదో నాలుగైదు రోజులు కాల్ షీట్స్ దొరికితే పూర్తి చేద్దామని దర్శకుడు జ్యోతి కృష్ణ ఎదురు చూస్తుంటే పవన్ బిజీ షెడ్యూల్ వల్ల సాధ్యపడటం లేదు. ఆధ్యాత్మిక యాత్ర, హెల్త్ చెకప్, అసెంబ్లీ సమావేశాలు, ఇదే నెలలో జనసేన ఆవిర్భావ దినోత్సవం లాంటి కారణాల వల్ల ఏపీ డిప్యూటీ సీఎం నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మార్చి 28 వచ్చి తీరాలని శపథం చేసుకున్న వీరమల్లు ఇప్పుడా మాట మీద నిలబడే పరిస్థితి లేదు. ఏప్రిల్ లేదా మే అంటే గ్యారెంటీగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. వేసవిలోగా రావాలని ఫ్యాన్స్ డిమాండ్.

వీటికి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది కానీ వీలైనంత త్వరగా అదేదో జరగాలని బయ్యర్ వర్గాలు కోరుకుంటున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ పైన చెప్పిన సమస్యల పట్ల పూర్తి అవగాహనతోనే ఉన్నప్పటికీ తక్షణ కర్తవ్యం ఏంటో గుర్తించలేక ఇబ్బంది పడుతున్నారు. అసలే గేమ్ ఛేంజర్ తో కొత్త ఏడాది బోణీ తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. దాన్ని చిరు, పవన్ ఎవరో ఒకరు ముందు తీరుస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో ఇలా జాప్యం జరగడం ఊహించనిది. అసలే సమ్మర్ సీజన్ చాలా టైట్ గా ఉంది. వరసగా అనౌన్స్ మెంట్లు వచ్చేస్తున్నాయి. చిరు, పవన్ లకు సోలో డేట్లు దొరకడం అంత సులభంగా లేదు.