‘వీరమల్లు’ ఇప్పుడు కాదు.. మరి ఎప్పుడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సినిమా.. హరిహర వీరమల్లు. ఈ సినిమాను అనౌన్స్ చేసి ఐదేళ్లు కావస్తోంది. దీని తర్వాత మొదలైన ‘భీమ్లా నాయక్’ విడుదలై మూడేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ ‘వీరమల్లు’ మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. ఇదిగో అదిగో అంటూనే ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ.. సినిమా మాత్రం విడుదల కావట్లేదు. చివరగా ప్రకటించిన రిలీజ్ డేట్.. ఈ మార్చి 28. ఇప్పటికీ చిత్ర బృందం ఈ డేట్‌కే కట్టుబడి ఉంది. కొన్ని వారాల ముందు కూడా నిర్మాత ఏఎం రత్నం చెప్పిన డేట్‌కే వస్తామని ధీమాగా చెప్పారు. కానీ చూస్తుండగానే మార్చిలోకి అడుగు పెట్టేశాం. కానీ ‘వీరమల్లు’ విడుదలయ్యే సంకేతాలేమీ కనిపించడం లేదు. మరోవైపు మార్చి 28కి పవన్ సినిమా రాదన్న ధీమాతో అదే డేట్‌కు రిలీజ్ ఫిక్స్ చేసుకున్న రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు ప్రమోషన్లలో దూసుకెళ్తున్నాయి.

మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ వస్తుందేమో అన్ని కొన్ని రోజుల ముందు వరకు కాస్త నమ్మకంతో ఉన్న వాళ్లు కూడా ఈ నెలలోకి అడుగు పెట్టగానే ఆశలు వదిలేసుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన సినిమాకు ఇంకా షూటింగ్ పెండింగ్ పెట్టుకుని ఇదే నెలలో రిలీజ్ చేస్తారని అనుకోవడం భ్రమే అవుతుంది. సినిమా వాయిదా పడుతుందనే విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. ఐతే ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఎప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేస్తారన్నది ప్రశ్న.

చిత్ర వర్గాలైతే ఇంకో వారం రోజుల పాటు మాత్రమే పవన్ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉందని అంటున్నారు. కానీ ఆ వారం డేట్లు కేటాయించడానికే పవన్ చాలా టైం తీసుకుంటున్నారు. ఆయన కాల్ షీట్లు ఇవ్వాలి. తనపై సన్నివేశాలు తీయాలి. సెకండాఫ్ మొత్తం ఎడిటింగ్ పూర్తి చేయాలి. బిజినెస్ చూసుకోవాలి. ప్రమోషన్లు చేయాలి. అప్పుడు కానీ రిలీజ్ మీద ఒక క్లారిటీ రాదు. ఏదో ఒకటి చేసి వేసవి చివర్లో అయినా సినిమాను రిలీజ్ చేస్తే చాలు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా జరిగిన దాన్ని బట్టి చూస్తే సమ్మర్‌ను కూడా ‘వీరమల్లు’ మిస్ అవుతుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. జులై-ఆగస్టుకు సినిమా వాయిదా పడ్డా ఆశ్చర్యం లేదు.